నవతెలంగాణ వలిగొండ రూరల్
గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు రాక దసరా పండుగ పూట పస్తులతో సతమతమవుతున్నామని గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షులు కొండె నర్సింహ్మ అన్నారు.
బుధవారం రోజున విలేకరులతో నర్సింహ్మ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన తరువాత రెండు నెలల వేతనాలు పడ్డాయని అన్నారు.
కానీ బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యింది మాత్రం ఒక్క నెల వేతనం మాత్రమేనని తెలిపారు. ఆ ఒక్క నెల వేతనం తీసుకునేందుకు కూడా ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడం మూలంగా ఆ ఒక్క నెల వేతనం కూడా తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో సిబ్బంది ఉన్నారని, ఇది కాంగ్రెస్ పాలనకే చెల్లుతుందని అన్నారు. తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా పండుగ రోజు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తే పాలకులకు, అధికారులకు ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు.
చిరుద్యోగులమైన మా పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అన్నారు. లక్షల రూపాయలు తీసుకునే ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడం సరైన విధానం కాదని అన్నారు. అధికారులకే కుటుంబాలు ఉన్నవి కానీ, సిబ్బందికి కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ సిబ్బందికి ఈ గతి పట్టిందన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి, అందుబాటులో లేని ప్రత్యేక అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.