– రెండో రోజూ నిరసన
– నిలిచిన రాకపోకలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెండు గదులు ఇళ్ల కేటాయింపు లో వివాదం రోజు రోజు కి రగులుతుంది. స్థానికులకు అన్యాయం చేశారంటూ బుధవారం నందమూరి కాలనీ వాసులు ఖమ్మం దేవరపల్లి రాష్ట్రీయ రహదారి పై అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపంలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద రాస్తారోకో చేపట్టారు.
కాలనీ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో గ్రామసభ లేకుండా డ్రా పద్ధతిలోనూ కాకుండా చీకటి ఒప్పందాలతో మున్సిపాలిటీలోని వేరే ప్రాంతం వారికి ఇల్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిలువ నీడ లేకుండా కాలనీలో చాలామంది ఉన్నామని, మాలో ఒక్కరికి కూడా ఇల్లు రాకుండా మొత్తం ఇళ్ళు వేరే వారికి ఎలా ఇస్తారని ఆందోళన చేపట్టారు.సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ ముఖం చాటేశాడని, అధికారులు సమస్య పరిష్కరించే దిశగా ఏ ఒక్క చర్య చేపట్టకపోవడంతో ఆగ్రహించిన కాలనీవాసులు రాష్ట్ర సరిహద్దుల్లోని హైవేని దిగ్బంధం చేశారు. అధికార యంత్రాంగం వచ్చేవరకు కదిలేది లేదని భైఠాయించదాంతో హైవే కిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.హెచ్.ఓ యయాతి రాజు,అదనపు ఎస్ఐ ఊకే రామ్మూర్తి లు అధికారులతో చర్చలు ఏర్పాటు చేస్తామని ధర్నా చేస్తున్న వారికి హామీ ఇచ్చి స్తంభించిన వాహనరాకపోకలను పునరుద్ధరించారు.