నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ లో 2021లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశానికి చెందిన మంత్రి భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 09న భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రయాణ ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకికి, భారత పర్యటన కోసం అనుమతి లభించింది. దీంతో అక్టోబర్ 09-16 మధ్య ఆయన దేశంలో పర్యటించనున్నారు.
జనవరి నుంచే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేపీ సింగ్‌లతో సహా ఇతర ఉన్నతాధికారులు ముత్తాకితో పాటు సీనియర్ తాలిబాన్ నాయకులతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. నిజానికి, తాలిబాన్ పరిపాలనను భారత్ అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ, ఇరు దేశాలు మాత్రం సంబంధాలను కొనసాగించాయి. తరుచుగా దుబాయ్ వేదికగా భారత్-తాలిబాన్ అధికారులు సమావేశమయ్యే వారు.