నవతెలంగాణ ఢిల్లీ: లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అల్లర్లకు కారకుడిగా ఆరోపిస్తూ లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అంతకుముందు తన భర్తను విడుదల చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీకి, కేంద్రమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు పాక్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె అన్నారు. వాంగ్ చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేసేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు. ‘‘నిర్బంధంలో ఉన్న నా భర్తను కలిసి, ఆయనతో మాట్లాడే హక్కు నాకు లేదా? ఈ కేసులో ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు నేను సాయం చేయకూడదా? సెప్టెంబరు 26న అరెస్టు చేసినప్పటి నుంచి ఇంతవరకు నా భర్తతో నన్ను మాట్లాడనివ్వట్లేదు. కలవనివ్వట్లేదు’’ అని ఆమె ఆరోపించారు.
లేహ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 90 మందికి పైగా గాయపడ్డారు. ఉద్యమకారుడు వాంగ్ చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. అనంతరం పోలీసులు ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జైలుకు తరలించారు. ఇలా అరెస్టయిన వ్యక్తిని విచారణ చేయకుండా 12 నెలల పాటు నిర్బంధించేందుకు చట్టం అనుమతినిస్తుంది. మరోవైపు, వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్టు లద్దాఖ్ డీజీపీ ఇటీవల వెల్లడించారు. వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ పాకిస్థానీ గూఢచారిని ఇటీవల అరెస్టు చేసినట్టు చెప్పారు.