- సురేష్ నగర్ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పారిశుద్ధ్య లోపానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సురేష్ నగర్ కాలనీలో గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. మురికి కాలువ సౌకర్యం లేక నివాస గృహాల మధ్య పెద్ద ఎత్తున నిలిచి కుంటను తలపిస్తున్న విషయమై కాలనీవాసుల ఆందోళన నేపథ్యంలో నవతెలంగాణ దినపత్రికలో ‘ఎవరికి చెప్పిన పట్టించుకునే నాథుడే లేరు’ అనే శీర్షికన గురువారం కథనం పచురితమైంది. దీంతో స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, సురేష్ నగర్ కాలనీలో నివాస గృహాల మధ్య రోజుల తరబడి పేరుకుపోయిన మురుగు నీటిలో గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చెల్లించి, ఆయిల్ బాల్స్ వేయించారు.
తూతూ మంత్రం చర్యలు వద్దు… శాశ్వత పరిష్కారం కావాలి…..
సురేష్ నగర్ కాలనీలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే తూతూ మంత్రపు పారిశుద్ధ్య కార్యక్రమాలు వద్దని…. తమకు శాశ్వత పరిష్కారం కావాలని కాలనీవాసులు అధికారులకు విన్నవిస్తున్నారు.ఇదే మాదిరి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఆయిల్ బాల్స్ వేయడం గత 4 నెలలుగా జరుగుతుందన్నారు.

తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై గత పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం నెలకొల్పడానికి శాశ్వత పరిష్కారం కావాల్సిందేనని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం సరేవ్వ అనే మహిళా డెంగ్యూ వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుటుందని, లక్కీ(10), రత్విక(5), శివ(6), ఉమా(8), యశ్విక(10) అనే చిన్నారులు తరచు వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దయచేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్థానిక నాయకులు సురేష్ నగర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం విషయంలో చొరవ చూపి తమ సమస్యను పట్టించుకోవాలని కోరుతున్నారు. సురేష్ నగర్ ఈస్ట్ కాలనీలో 4 గల్లీలలో దాదాపు 30 ఇళ్లకి ఇప్పటి వరకు డ్రైనేజీ వ్యవస్థ లేదని, ఇండ్లలో నుండి బయటకు వచ్చే మురుగు నీరు అంతా ఒక చోట చేరి కాలనీ మధ్యలో మురికి నీటి కుంటను తలపిస్తుందని పలువురు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో తూతూ మంత్రం చర్యలు వద్దని, కాలనీవాసుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొనిశాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
