నవతెలంగాణ-హైదరాబాద్: తన టీనేజ్ కూతురు మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో .. నగ్న ఫోటో పంపాలంటూ ఓ సైబర్ క్రిమినల్ మెసేజ్ చేశాడని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ తన కూతురు చాలా సమయస్పూర్తితో స్పందించి తన మొబైల్‌ను స్విచాఫ్ చేసిందన్నారు. ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు సీనియర్ పోలీసు ఆఫీసర్లు కూడా ఆ వేదికపైనే ఉన్నారు.
కొన్ని నెలల క్రితం ఈ ఘటన జరిగిందని, తన కుమార్తె ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెకు తారసపడ్డాడని, అతను తొలుత స్నేహపూర్వకంగా మెసేజ్‌లు చేశాడని, తర్వాత ఆ వ్యక్తే అకస్మాత్తుగా నగ్న ఫోటోలు పంపాలంటూ మెసేజ్ చేసినట్లు అక్షయ్ పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో తన కుమార్తె చాలా తెలివిగా ప్రవర్తించి, చాకచక్యంగా తన ఫోన్‌ను స్విచాఫ్ చేసిందని, ఆ తర్వాత తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పిందని అక్షయ్ గుర్తు చేశారు. తన కూతురు అలర్ట్‌గా ఉండడం వల్ల.. సైబర్ క్రిమినల్స్ బారినపడలేదన్నారు. రాష్ట్రంలోని 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు స్కూళ్లలో సైబర్ అవగాహనపై పాఠాలు బోధించేలా చూడాలని సీఎం ఫడ్నవీస్‌ను అక్షయ్ కోరారు.