నవతెలంగాణ వాషింగ్టన్ : అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠిన నిబంధనలపై పలు కార్మిక సంఘాలు, విద్యావేత్తలు, మత సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసేవారిపై లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించడాన్ని సవాలు చేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి.
ఈ వ్యాజ్యంలో సెప్టెంబర్ 19న ట్రంప్ జారీ చేసిన ప్రకటనలో అనేక తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు హెచ్-1బీ వీసా కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించిన వీసా పథకాన్ని దెబ్బతీసేలా, ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఇంత భారీ ఫీజును విధించడం అన్యాయమని ఫిర్యాదులో వివరించారు.
ఈ లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా పునరుద్ధరణ చేసుకునేవారికి వర్తించదని వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. 2024లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలు భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.