నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీల విడుదల, గాజా పాలనను స్వతంత్రులకు అప్పగించడం వంటి కీలక అంశాలకు అంగీకారం తెలిపిన హమాస్, ప్రణాళికలోని పలు ఇతర షరతులపై మాత్రం చర్చలు జరపాలని, ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచనలు జారీ చేశారు.
గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘హమాస్ ప్రకటన ప్రకారం.. శాశ్వత శాంతికి వారు సిద్ధంగా ఉన్నట్లు నమ్ముతున్నా. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. దీంతో మనం బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేసుకోగలం. ప్రస్తుతం దానిపై దాడులు చేయడం చాలా ప్రమాదకరం’ అని రాసుకొచ్చారు.