Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలుSCERT Telangana: అతడే ఒక ప్రయోగశాల

SCERT Telangana: అతడే ఒక ప్రయోగశాల

- Advertisement -


తరగతి గదులే దేశ భవిష్యత్తు పునాది రాళ్లు

నవతెలంగాణ కంఠేశ్వర్

భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా పరుగులు తీస్తున్న తరుణంలో, శాస్త్రవేత్తల నిర్మాణం అత్యవసరం. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ అందుబాటులో ఉండే పూర్తి స్థాయి ప్రయోగశాలలు, పరికరాలు, రసాయనాలు లేవు. శాస్త్రీయ భావాలను మనసుకు హత్తుకునేలా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే ఉపాధ్యాయుల కొరత కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది.

ఈ పరిస్థితుల్లో తరగతి గదినే ప్రయోగశాలగా మార్చాలి అనే కొత్త ఆలోచన, వినూత్న సంకల్పం ఆవిర్భవించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దుబ్బా లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముద్దుకృష్ణ, తన సృజనాత్మక బోధన పద్ధతులతో విద్యార్థుల్లో శాస్త్రాసక్తిని రేకెత్తిస్తున్నారు. ఆయన పాఠశాలలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదివే స్థాయిలోనే కాకుండా, పరిశీలనాత్మక దృష్టితో ప్రతి విషయం వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని అర్థం చేసుకునేలా మారుతున్నారు. పాఠశాలలో ప్రయోగశాల లేకపోయినా, బోధనలో ప్రయోగశీలత ఉంటేనే భవిష్యత్తు శాస్త్రవేత్తలు పుడతారు అని ఆయన చెప్పే మాటలు ఈ ఆలోచనకు బలమైన సాక్ష్యం.

వాడి పారేసిన పనికిరాని వాడని వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, కాగితం, బెలూన్లు, పైపులు, ట్యూబులు, గ్లాస్, కార్డ్బోర్డ్ షీట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, సిరంజిలు, ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసులు,కరెంట్ వైర్లు మొదలైన వాటితో ఆయన ప్రత్యేక మోడళ్లు రూపొందిస్తున్నారు. సాంద్రత, స్థావర విద్యుత్, పాస్కల్ ఆర్కిమెడిస్ నియమాలు, గాలి పీడనం, ఆకర్షణ శక్తి, న్యూటన్ చలన నియమాలు, ఘర్షణ శక్తి , బలాలు వాటి రకాలు వంటి క్లిష్టమైన సూత్రాలను పిల్లలు చూసి, చేసి, అనుభవించి నేర్చుకునేలా కృత్యధార చేస్తున్నారు.

ముద్దు కృష్ణ కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు. ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి, సైన్స్ బోధనను ప్రయోగాత్మకంగా, సృజనాత్మకంగా మార్చే మార్గాలను చూపిస్తున్నారు. వివిధ వర్క్‌షాపులలో ఆయన చేసిన మోడళ్లు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి.

జాతీయ స్థాయిలో గౌరవం

విద్యార్థులకోసం వినూత్న బోధనా అభ్యాస సామగ్రిని రూపొందించి, వినూత్న బోధనా అభ్యాస సామగ్రి వర్గీకరణ లో జాతీయ స్థాయిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ టీచర్ సైంటిస్ట్ ప్రత్యేక బహుమతి ప్రదానం , జీవితకాల సభ్యత్వం మంజూరు చేయబడింది చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు విజ్ఞాన్ భారతి సంయుక్తంగా నిర్వహించాయి.

దక్షిణ భారత స్థాయిలో విజయం

సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ లో నిర్వహించిన దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉపాధ్యాయ ప్రదర్శన పోటీలో పాల్గొని, మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఈ విజయంతో తెలంగాణకు ప్రత్యేక గౌరవం తీసుకువచ్చారు.

విద్యా పరిశోధనలో భాగస్వామ్యం

తెలంగాణ రాష్ట్ర విద్యా మరియు పరిశోధనా మండలి (SCERT Telangana) నిర్వహించిన సెమినార్ పేపర్ ప్రెజెంటేషన్ లో కూడా ముద్దుకృష్ణ పాల్గొన్నారు.అలాగే ఇటీవల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సైన్స్ విద్యార్థుల కోసం ప్రయోగశాల మాన్యువల్స్ తయారీలో ముఖ్య భూమిక పోషించారు.ఈ మాన్యువల్స్ ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ప్రయోగాత్మక సైన్స్ నేర్చుకునే అవకాశాన్ని పొందనున్నారు.

అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు

ముద్దు కృష్ణ ప్రతిభ స్థానిక, రాష్ట్ర స్థాయిలను దాటి జాతీయ మరియు అంతర్జాతీయ వేదికల వరకు విస్తరించింది. ఆయన 2023, 2024లో రెండుసార్లు భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ (ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -ఐ ఐ ఎస్ ఎఫ్)లో పాల్గొని, తన వినూత్న మోడళ్లు, శాస్త్ర ఆవిష్కరణలను ప్రదర్శించారు.

ఈ విజయాలు ఆయనకే కాకుండా తెలంగాణకు గర్వకారణమయ్యాయి.

విద్యార్థులకు ప్రేరణ కలిగించడం

ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థులు అనేక సైన్స్ ఈవెంట్స్, సెమినార్లు, ప్రదర్శనలు మరియు సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు.

కొత్త తరానికి ప్రేరణ

పాఠ్యపుస్తకాల్లో శాస్త్రం కేవలం సిద్ధాంతం కాకుండా, ప్రతిరోజు జీవితంలో అనుభవించగలిగే అంశం అని విద్యార్థులు గ్రహించేలా ముద్దు కృష్ణ బోధన కొనసాగుతోంది. ఈ వినూత్న విధానం విద్యార్థుల ఊహాశక్తిని పెంపొందించి, సృజనాత్మక ఆలోచనలకు దారితీస్తోంది.

వివిధ సంస్థలతో సహకారం

అతను విద్యార్థి విజ్ఞాన మంథన్‌కు నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ విద్యార్థులను సైన్స్ టాలెంట్ పరీక్షలు రాయించారు. జఠధార కన్సల్టెన్సీ నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష, టీఎస్ ఆర్ జె సి పరీక్ష, ఇతర విద్యార్థుల ప్రోత్సాహక ఆన్‌లైన్ పరీక్షల కోసం అతను చాలా మంది పిల్లలను ఆన్‌లైన్ తరగతులకు హాజరు చేసేలా చేశాడు, చాలా మంది విద్యార్థులు నగదు బహుమతులు పొందేలా చేశాడు.

ముద్దు కృష్ణ మాటల్లో

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి చెందిన చల్లా ముద్దుకృష్ణ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బాలో విధులు నిర్వహిస్తున్నారు. 2008 నుండి 2009 వరకు రెండు సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు.తరువాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 2009 లోగా ఎంపికయ్యాడు. భీమ్‌గల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరి 2009 నుండి 2018 వరకు 9 సంవత్సరాలు పనిచేశారు.

అప్పటి నుండి నేటి వరకు దుబ్బా నిజామాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. శాస్త్రం అనేది పిల్లలు కళ్లారా చూసి, తాకి, అనుభవించినప్పుడే నిజమైన విజ్ఞానం అవుతుంది. వ్యర్థ వస్తువులను ఉపయోగించి శాస్త్ర మోడళ్లు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -