నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ తన ‘ఎక్స్’ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తనకు పాలన గురించి ఏమీ తెలియదని, తాను ఒక చిన్న నటుడిని మాత్రమేనని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ.. కేసీఆర్ తిరిగి వచ్చే సమయం ఆసన్నమైందని, ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ఇచ్చిన హామీలన్నీ విఫలమయ్యాయని పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ట్వీట్‌లపై దుమారం రేగడంతో రాహుల్ ‘ఎక్స్’ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆయన ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. అదే సమయంలో ఆయన ఒక ట్వీట్ చేశారు.
తన కంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. పాలన, పరిపాలన గురించి తనకు ఏమీ తెలియదని, తాను ఒక చిన్న నటుడిని మాత్రమేనని అన్నారు. పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత తన అసహనం సరైనది కాదని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎవరు పాలించినా మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.
ఇకపై ‘ఎక్స్’ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. వ్యవస్థతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. తన వృత్తి అయిన సినిమాలపై దష్టి సారిస్తానని పేర్కొన్నారు. చివరలో “జై తెలంగాణ, జై హింద్” అంటూ ముగించారు.