నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలిస్తామని.. వారితో చర్చల ప్రసక్తే లేదంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మావోయిస్టులతో ఇక చర్చల ప్రసక్తే లేదన్న అమిత్ షా.. లొంగిపోవాల్సిందేనన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని.. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామంటూ అమిత్ షా పేర్కొన్నారు. శనివారం ఆయన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం లేదని స్పష్టం చేశారు.
మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్ షా హెచ్చరించారు. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్ షా పిలుపునిచ్చారు.