నవతెలంగాణ – హైదరాబాద్ : గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్‌లోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులు బ్లాక్ కావడంతో పాటు వంతెనలు కొట్టుకు పోయాయని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనల్లో సుమారు 22మంది మరణించారని అన్నారు. భారత్‌కు తూర్పు సరిహద్దుగా ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారని పోలీస్ ప్రతినిధి బినోద్ తెలిపారు. దక్షిణ నేపాల్‌లో పిడుగులు పడి ముగ్గురు మరణించగా, తూర్పు నేపాల్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో వరదల కారణంగా ఒకరు మరణించారని అన్నారు.
ఆగ్నేయ నేపాల్‌లోని కోషి నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోందని అన్నారు. నదిలో నీటి ప్రవాహం సాధారణం కన్నా రెండింతలు ఉన్నట్లు తెలిపారు. 56 సూయిజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. వరదల్లో శనివారం 11మంది కొట్టుకుపోయారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఎ) ప్రతినిధి శాంతి మహత్ తెలిపారు.
కొండచరియలు విరిగిపడటంతో రహదారులు బ్లాక్ అయ్యాయని, దీంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అన్నారు. వర్షాలకు దేశీయ విమానాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.