Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇనుప రాడ్డుతో తలపై మోది..అత్త ప్రాణం తీసిన కోడలు

ఇనుప రాడ్డుతో తలపై మోది..అత్త ప్రాణం తీసిన కోడలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వనపర్తి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన అత్తను ఇనుప రాడ్డుతో కొట్టి కిరాతకంగా హత్య చేసింది. ఈ విషాదకర సంఘటన రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73) భర్త చనిపోవడంతో తన ఒక్కగానొక్క కుమారుడైన మల్లయ్య, కోడలు బొగురమ్మ వద్ద నివసిస్తోంది. కొంతకాలంగా అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అత్త పెట్టే బాధలు భరించలేకపోయానని భావించిన కోడలు బొగురమ్మ, ఆమెపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది.

ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఇనుప రాడ్డుతో అత్త ఎల్లమ్మ తలపై బలంగా మోదింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, నిందితురాలు బొగురమ్మను అదుపులోకి తీసుకున్నారు. తన అత్త నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగిపోయి తానే హత్య చేసినట్లు బొగురమ్మ పోలీసుల విచారణలో అంగీకరించింది. మృతురాలి రెండో కుమార్తె బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -