నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని ఆయన గుర్తుచేశారు. కొందరు కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.