నవతెలంగాణ-విజయవాడ: 2025 అక్టోబర్ 5, 6 తేదీలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశమై క్రింది తీర్మానాలను ఆమోదించింది.
తీర్మానం -1
సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై మతోన్మాదుల దాడికి సీపీఐ(ఎం) ఖండన
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి – సీపీఐ(ఎం) డిమాండ్
సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే చెప్పు విసరటం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతున్నది. మోడీ పాలనలో మతోన్మాదులు అన్ని వ్యవస్థలను ఇప్పటివరకు ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు బహిరంగంగా సనాతనధర్మ పరిరక్షణ పేరుతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే చెప్పు విసరటం రాజ్యాంగానికి, దేశ ప్రజలకు అవమానం. ఇదే సనాతన ధర్మం అని ప్రధానమంత్రి భావిస్తున్నారా ? జాతికి దీనిపై ప్రధానమంత్రి జవాబు చెప్పాలి. సనాతన ధర్మం పేరుతో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ దీన్ని బలపరుస్తారా వ్యతిరేకిస్తారా కూడా చెప్పాలి. ఇలాంటి ఘటనలే సనాతన ధర్మం యొక్క అసలు రూపాన్ని వ్యక్తపరుస్తున్నది. కేవలం దళితుల నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన గవారు లాంటి వారిని చూసి సహించలేక చేసిన అగ్రకుల మతోన్మాద చర్య. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఈరోజు జరిగిన సమావేశం ఖండిస్తూ తీర్మానం చేసింది. దోషులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సనాతన ధర్మవాదుల్ని అరికట్టాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేస్తున్నది.
తీర్మానం -2
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయొద్దని… జరుగుతున్న పోరాటంపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి…
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆగష్టు 6న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. మొత్తం ప్రజానీకం ప్రజాభిప్రాయ సేకరణలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజయ్యపేట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని గత 23 రోజులుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణం బల్క్‌డ్రగ్ పార్కు ప్రతిపాదన విరమించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
ఈ దీక్షలపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. దీక్షలకు ముందుగా అనుమతి ఇవ్వలేదు. 4 రోజుల తరువాత ప్రజల పోరాటానికి తలొగ్గి దీక్షలకు అనుమతి ఇచ్చింది. రాజయ్యపేట గ్రామాన్ని హోం మంత్రి సందర్శించిన సందర్భంలో గ్రామస్తులు ఘెరావ్ చేశారు. కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తాత్కాలికంగా పనులు నిలిపివేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. నేటికీ దీక్షలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా పోలీసులు సీపీఐ(ఎం) నాయకులు యం.అప్పలరాజుని గృహ నిర్బంధంలో ఉంచారు. రాజయ్యపేట గ్రామం వెళ్ళడానికి వీలులేదని యం.అప్పలరాజుని గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం అప్పలరాజు ఇతర పోరాట నాయకులపై ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేస్తున్నది. ప్రజల పోరాటానికి సీపీఐ(ఎం) సంఘీభావం ప్రకటిస్తున్నది.