Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంరెండు దశల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

రెండు దశల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -

నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌
మొదటి దశలో 121.. రెండో దశలో 122 స్థానాలకు ఓటింగ్‌
నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. సోమవారం నాడిక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సింధు, వివేక్‌ జోషిలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 6న తొలి విడత, నవంబర్‌ 11న రెండో విడత పోలింగ్‌ జరుగుతుందని ఆయన వెల్లడించారు. మొదటి దశలో 121 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నట్టు తెలిపారు. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేసి, ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు తరువాతే వివిప్యాట్‌, ఈవీఎంల లెక్కింపు చేపడతామని ఆయన చెప్పారు.
ఈసీఐనెట్‌ యాప్‌తో ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి గురించి అప్‌డేట్‌ ఉంటుందన్నారు. ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ యాప్‌లో ఓటింగ్‌ డేటా అప్‌డేట్‌ అవుతుందని జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద మొబైల్‌ డిపాజిట్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌లను కొత్తగా ఇవ్వనున్నామనీ, ఆ స్లిప్స్‌పై ఓటరు ఐడీ నెంబర్‌ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో అత్యధికంగా 1200 మంది ఓటర్లు మాత్రమే పోలింగ్‌ చేసే రీతిలో ఏర్పాట్లు చేశామన్నారు.

ఎస్‌ఐఆర్‌తో 68.5 లక్షల ఓట్లు తొలగింపు
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు బీహార్‌ అసెంబ్లీవేనని జ్ఞానేశ్‌ కుమార్‌ అన్నారు. ఎస్‌ఐఆర్‌తో బీహార్‌లో 68.5 లక్షల మంది ఓటర్లను తొలగించామనీ, 21.5 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో బీహార్‌ ఓటర్ల జాబితాను పరిశుభ్రం చేసినట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులను అభ్యంతరాలు దాఖలు చేయాలని కోరామనీ, ఆ తరువాతనే ముసాయిదాను పబ్లిష్‌ చేశామన్నారు. సెప్టెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను వెల్లడించినట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్టు ఆయన అన్నారు. నామినేషన్లకు పది రోజుల ముందు కూడా ఓటర్లు మార్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ప్రకటించామనీ, ఒకవేళ ఎవరైనా అప్పీల్‌ చేసుకోవాలనుకుంటే, నామినేషన్‌కు పది రోజుల ముందు వరకు చేసుకోవచ్చని జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. ఓటర్లకు వీలైన రీతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామనీ, రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు.

ఓటర్లు 7.43 కోట్ల మంది..
పోలింగ్‌ స్టేషన్లు 90వేలకు పైనే

మొత్తం 7.43 కోట్ల మంది బీహారీ ఓటర్లలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు 14 లక్షల మంది ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఫిర్యాదులకైనా 1950 నెంబర్‌కు ఓటర్లు డయల్‌ చేయొచ్చని తెలిపారు.
ఏ పోలింగ్‌ కేంద్రంలోనూ 1200 మందికి మించి ఓటర్లు ఉండరనీ, తాజా సవరణతో బీహార్‌లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్‌ కేంద్రాలు 90,712కి పెరిగాయన్నారు.
మొత్తం 243 స్థానాలు కలిగిన బీహార్‌ అసెంబ్లీకి నవంబర్‌ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. కాగా 2020లో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్‌ జరుగగా.. అంతకు ముందు ఐదు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం రెండు విడతల్లోనే పోలింగ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

నవంబర్‌ 11న దేశవ్యాప్తంగా 8 స్థానాలకు బైపోల్స్‌
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్‌ 11న బీహార్‌ అసెంబ్లీ పోలింగ్‌ రెండో దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. నవంబర్‌ 14న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన తెలంగాణ, రాజస్తాన్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, మిజోరం, ఒడిశా, జమ్మూకాశ్మీర్‌లో ఖాళీ అయిన ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 11న ఉపఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలోని జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, పంజాబ్‌లోని తర్న్‌ తరణ్‌ ఎమ్మెల్యే కశ్మీర్‌ సింగ్‌ సోహల్‌, జార్ఖండ్‌లోని ఘట్సిలా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్‌ సోరెన్‌, మిజోరాంలోని డంపా నియోజకవర్గం ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా, ఒడిశాలోని నువాపాడ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణించిన నేపథ్యంలో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజస్తాన్‌లోని అంటా ఎమ్మెల్యే కన్వర్‌లాల్‌ మీనా దోషిగా తేలి అనర్హత వేటు పడటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచిన తరువాత రాజీనామా చేసిన బుద్గామ్‌, ఎమ్మెల్యే దేవేందర్‌ సింగ్‌ రాణా మరణంతో ఖాళీ అయిన నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నది.
షెడ్యూల్‌ ఇదే
మొదటిదశ రెండో దశ

  1. నోటిఫికేషన్‌ విడుదల అక్టోబర్‌ 10 (శుక్రవారం) అక్టోబర్‌ 13 (సోమవారం)
  2. నామినేషన్ల దాఖలు గడువు అక్టోబర్‌ 17(శుక్రవారం) అక్టోబర్‌ 20 (సోమవారం)
  3. నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 18 (శనివారం) అక్టోబర్‌ 21 (మంగళవారం)
  4. నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్‌ 20 (సోమవారం) అక్టోబర్‌ 23 (గురువారం)
  5. పోలింగ్‌ నవంబర్‌ 6 (గురువారం) నవంబర్‌ 11 (మంగళవారం)

ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14 (శుక్రవారం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -