కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడడం దుర్మార్గమనీ, దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ముసుగులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులోనే సీజేఐపై భౌతిక దాడికి పాల్పడటం దేశ చరిత్రలోనే చీకటి రోజు అని ఆందోళన వ్యక్తం చేశారు.
సీజేఐ బీఆర్ గవాయ్‌పై మనువాదుల దాడి తెలంగాణ గిరిజన సంఘం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై మనువాద శక్తుల దాడి అమానుషమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మత ఉగ్రవాది రాకేష్ కిషోర్ అనే న్యాయవాది తన బూటు విసిరి దాడికి పాల్పటం దుర్మార్గమని విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
దాడి దుర్మార్గం : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్
జస్టిస్ గవారుపైకి న్యాయవాది ముసుగులో ఉన్న మతోన్మాది కిషోర్ దాస్ చెప్పు విసిరి దాడికి పాల్పడడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎండి జబ్బార్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీజేఐపై దాడి అత్యంత హేయమైనదనీ, న్యాయవ్యవస్థకు, దేశానికి అవమానమని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగంపై దాడి అని తెలిపారు.
బీఆర్ గవాయ్‌పై దాడి హేయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవారుపై జరిగిన దాడి హేయమైనదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. న్యాయవ్యవస్థను తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా బెదిరించేందుకే ఈ దాడి చేశారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవారుపైనే నిండు కోర్టులో ఒక న్యాయవాది దాడి చేసే ప్రయత్నం అత్యంత దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. ఇది కేవలం గవారుపై జరిగిన దాడి మాత్రమే కాదనీ, భారత సర్వోన్నత న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని తెలిపారు.
టీఎస్‌యూటీఎఫ్ ఖండన
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి ప్రయత్నించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుల దురహంకారం, మత అసహనం నేడు దేశమంతటా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీజేఐపై కోర్టు హాల్‌లో బూటుతో దాడికి ప్రయత్నించిన అడ్వకేట్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఆ ఉన్మాదిని కాల్చిచంపాలి : టీఎస్‌పీటీఏ
జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిచేయడానికి యత్నించిన ఉన్మాద న్యాయవాది రాకేశ్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ఉప ప్రదాన కార్యదర్శి రోహిత్‌నాయక్ రాష్ట్రపతిని డిమాండ్ చేశారు. దేశంలో 12 ఏండ్లుగా మతోన్మాద శక్తులు వ్యాపింపజేస్తున్న ఉన్మాద, విద్వేష, విధ్వంసక వైరస్ ఫలితమే ఈ క్రూరమైన ఘటనకు ప్రేరేపితమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీజేఐపై దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
- Advertisement -
- Advertisement -