నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్‌లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలానికి వచ్చిన వరద గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గతంలో 1994-95లో 2039.23 టీఎంసీలు, 2022-23లో 2039.87 టీఎంసీల ప్రవాహం రాగా, ఈసారి ఆ రికార్డులు చెరిగిపోయాయి. ఈ సీజన్ ముగిసేలోగా మరో 100 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కృష్ణా బేసిన్ నుంచి 1,382 టీఎంసీలు, గోదావరి నుంచి 3,905 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.
ఇంత భారీ స్థాయిలో వరద వస్తుండటం శ్రీశైలం డ్యామ్ పటిష్ఠతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. డ్యామ్ దిగువన నదిలో ఏర్పడిన భారీ గొయ్యి (ప్లంజ్‌పూల్) ఈ ఆందోళనలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. 2018 జులైలో నిర్వహించిన బాతోమెట్రిక్ సర్వేలో ఈ గొయ్యి ఏకంగా 120 మీటర్ల లోతు ఉన్నట్లు తేలింది. ఇది డ్యామ్ పునాదుల లోతును కూడా మించిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యామ్ పునాదుల కింద ఉన్న రాతి ఫలకాల మధ్య బలహీనమైన అతుకులు (షీర్ జోన్లు) ఉన్నాయని జియలాజికల్ సర్వే గతంలోనే వెల్లడించింది. ఈ భారీ గొయ్యి ఆ బలహీనమైన భాగాలపై ప్రభావం చూపి ఉండవచ్చని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) తన నివేదికలో పేర్కొంది.
2009 అక్టోబరులో వచ్చిన 25.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద దాదాపు 78 గంటల పాటు కొనసాగడంతో డ్యామ్ తీవ్రంగా దెబ్బతింది. అప్పుడే కట్టడం కుదుపునకు గురైందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర సంస్థలకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎన్‌డీఎస్‌ఏ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రంగంలోకి దిగి రక్షణ చర్యలకు ఉపక్రమించాయి. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వరద తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.