నవతెలంగాణ-హైదరాబాద్: 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. నవంబర్ 6,11 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈక్రమంలో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. వివిధ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మల్లాగుల్లాలు పడుతున్నాయి. బహుముఖ పోటీ ఉన్న స్థానాల్లో ఆయా పార్టీలు.. అభ్యర్థుల సామర్థ్యంపై ఇప్పటికే రహస్యంగా సర్వేలు కూడా చేయించాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడ ముందస్తు ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ అనేక సార్లు బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్, రాష్ట్రయ్ జనతా దళ్ పార్టీలు ఆ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ఢంకా మోగడంతో అభ్యర్థుల ఎంపికపై జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన పాట్నాలోని పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ లోకల్ లీడర్ల, ఇతర ముఖ్యనాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమావేశానికి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.ఈ భేటీలో పొత్తు స్థానాలతో పాటు ఆయా స్థానాలకు పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో పాటు CPI, CPI (ML) వంటి ఇతర వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి BJP, JD(U), LJP (RV) HAMS ఇతరులతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు పోటీ ఇవ్వనుంది. అయితే ఇరు కూటములు కూడా భాగస్వాములతో ఎటువంటి సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించలేదు.