Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబొంతు రామ్మోహన్ కీల‌క వ్యాఖ్య‌లు

బొంతు రామ్మోహన్ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు. టికెట్‌ కోసం ఎవరిని అడలేదని తెలిపారు. అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు.

కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లు జూబ్లీహిల్స్‌ సీటు ఆశిస్తున్నారని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. వీరిలో నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, సీఎన్‌ రెడ్డి పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్ సర్కార్‌ సిఫారసు చేసిన‌ట్లు విశ్వాస‌నీయ స‌మాచారం. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.

కాగా, హైదరాబాద్‌ జిల్లాలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 11న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 14న కౌంటింగ్‌ చేపట్టి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెల 13న విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్‌ జారీకావడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్‌ 14న యూసుఫ్‌గూడలోని కేవీఆర్‌ స్టేడియం లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలిపారు.

జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరగనున్నది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్‌ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -