Wednesday, October 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు..

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ ఇటీవలే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. మరోవైపు బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ తమను ప్రతివాదులగా చేర్చాలంటూ దాదాపు 30 ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ మేరకు ఇవాళ అన్ని పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

మొదట పిటిషనర్ తరఫు అడ్వొకేట్ విక్రమ్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ఆగస్ట్ 31న రాష్ట్రంలోని రెండు చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, బిల్లు ఇంకా చట్టంగా మారలేదని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఔనని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో నెం.9తో పాటు జీవో నెం.41ను కూడా తాము చాలెంజ్ చేస్తున్నామని అన్నారు. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే.. రిజర్వేషన్లు 50 శాతం దాటకూదని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో అక్కడి ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసిందని. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. రాకేష్ కుమార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు కూడా ఉందన్నారు.

మొత్తం నాలుగు అంశాల ఆధారంగా జీవో నెం.9ను చాలెంజ్ చేస్తున్నామని ధర్మాసానికి తెలిపారు. బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం వేసిన వన్ మ్యాన్ కమిషన్ కూడా ఇంకా బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. ఎంపిరికల్ డేటా కూడా సమగ్రంగా లేదన్నారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండానే 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కామెంట్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు మాత్రమే రాజ్యాంగబద్ధమైనవని అన్నారు. కానీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగపరమైన తప్పనిసరి ఏం లేదన్నారు. బిల్లు చట్టంగా మారిందనుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆరోపించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. అలా కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే పరిస్థితులు ఉంటాయన్నారు. ఎన్నికలను ఆపడం తమ ఉద్దేశం కాదని.. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని పిటిషనర్ తరఫు న్యాయవాది విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ కలుగుజేసుకుని ట్రిపుల్ టెస్ట్‌లో 50 శాతం సీలింగ్ మాత్రమే మీ అభ్యంతరమా అని ప్రశ్నించారు. మరికొద్దిసేపట్లో ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, ఏజీ సుదర్శన్ రెడ్డి, రజినీకాంత్ రెడ్డి, రవి‌వర్మ తమ వాదనలు వినిపించనున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -