నవతెలంగాణ-హైదరాబాద్: 2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకున్న శాస్త్రవేత్తలు జాన్ మార్టినిస్, మైఖేల్ డేవొరే, జాన్ క్లార్క్‌లను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభినందించారు. ఈ విజేతల్లో ఇద్దరు గూగుల్‌కు చెందిన క్వాంటం ఏఐ ల్యాబ్‌తో కలిసి పనిచేసిన వారని ఆయన గుర్తుచేసుకున్నారు. క్వాంటం మెకానిక్స్ రంగంలో వారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. “మైఖేల్ డేవొరే, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లకు నోబెల్ బహుమతి గెలుచుకున్నందుకు అభినందనలు. మైఖేల్ మా క్వాంటం ఏఐ ల్యాబ్‌లో చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ హార్డ్‌వేర్ కాగా, జాన్ మార్టినిస్ చాలా ఏళ్లు హార్డ్‌వేర్ టీమ్‌కు నాయకత్వం వహించారు” అని పిచాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. 1980వ దశకంలోనే వీరు క్వాంటం మెకానిక్స్‌లో ప్రాథమిక పరిశోధనలకు పునాదులు వేశారని ఆయన ప్రశంసించారు.
ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో స్థూల క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్‌ను కనుగొన్నందుకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది. 1984-85 మధ్యకాలంలో వీరు సూపర్ కండక్టర్లతో కూడిన ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌పై కీలక ప్రయోగాలు చేశారు. తాను ఇటీవలే శాంటా బార్బరాలోని గూగుల్ క్వాంటం ల్యాబ్‌ను సందర్శించానని, అక్కడ జరుగుతున్న పురోగతిని చూసి ఆశ్చర్యపోయానని పిచాయ్ తెలిపారు. గూగుల్ సంస్థలో ఇప్పటివరకు ఐదుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు ఉండటం గర్వంగా ఉందని, కేవలం రెండేళ్లలోనే మూడు నోబెల్ బహుమతులు తమ సంస్థతో సంబంధం ఉన్నవారికి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.