నవతెలంగాణ-హైదరాబాద్: శాసనసభలో భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించిన ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేలను కేరళ అసెంబ్లీ గురువారం సస్పెండ్ చేసింది.యుడిఎఫ్ సభ్యులు రోజి ఎం.జాన్, ఎం.విన్సెంట్, సనీష్ కుమార్‌లు సస్పెండ్‌కు గురయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మిగిలిన కాలానికి సభకు హాజరుకాకుండా నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ గురువారం ఆమోదించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.బి. రాజేష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్పీకర్ ఎ.ఎన్.షమ్సీర్‌పై యుడిఎఫ్ సభ్యులు భౌతికంగా దాడి చేయకుండా రక్షణగా నిలిచిన మహిళలు సహా వాచ్ అండ్ వార్డ్ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచి, అన్ని హద్దులను దాటారని అన్నారు. యుడిఎఫ్ హింసాత్మక దాడిలో మార్షల్ చీఫ్ ఎం.శిబు కుడి చేతికి తీవ్ర గాయమైందని అన్నారు. ప్రస్తుతం ఆయనకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స జరగాల్సి వుందని అన్నారు.
అక్టోబర్ 6న అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనప్పటి నుండి యుడిఎఫ్ సభలో తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తోందని, శబరిమల అంశంపై హైకోర్టు ఆదేశించిన క్రైమ్ బ్రాంచ్ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పదేపదే అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తోందని అన్నారు. కీలక బిల్లులపై చర్చలకు దూరంగా ఉందని, నియోజకవర్గ ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని అన్నారు. శబరిమల అంశంపై వాయిదా చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్దాల ముసుగు వేసేందుకు యత్నిస్తున్న యుడిఎఫ్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిందని అన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు యత్నించిన స్పీకర్ మధ్యవర్తిత్వాన్ని యుడిఎఫ్ తోసిపుచ్చిందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పైకి సైతం వారు దూసుకువచ్చారని, అడ్డుకున్న వాచ్ అండ్ వార్ సిబ్బందిపై పదేపదే దాడి చేశారని అన్నారు. ఎమ్మెల్యే వి.డి.సతీసన్ సభలో భీభత్సం సృష్టించారని అన్నారు. ప్రభుత్వ తీర్మానాన్ని ట్రెజరీ బెంచ్‌లు వాయిస్ ఓటు ద్వారా ఆమోదించాయి.