నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ప్రజలకు తాజాగా కీలక హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఇందుకు సంబందించిన ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారు.
పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం గత 20 ఏళ్లుగా యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. మీకు మాటిస్తున్నా.. మేము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓ చట్టాన్ని తీసుకొస్తాం. 20 నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం ఉండదు. ప్రతీ కుటుంబంలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది.