నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ నెలలో 6న మొదటి దశలో 121 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత అదే నెల 11న రెండో దఫాలో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 14న పోలింగ్ ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికల నిర్వహణపై సాధ్యసాధ్యాలపై పరిశీలించింది. తాజాగా ఈక్రమంలో పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించడానికి కసరత్తు చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా దాదాపు 4.53 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 2.5 లక్షల మంది పోలీసు అధికారులు, 28,370 మంది కౌంటింగ్ సిబ్బంది, 17,875 మంది మైక్రో అబ్జర్వర్లు, 9,625 మంది సెక్టార్ అధికారులు, కౌంటింగ్ కోసం 4,840 మంది మైక్రో అబ్జర్వర్లు, 90,712 మంది అంగన్‌వాడీ సేవాకార్యక్రమాలను కూడా నియమించనున్నట్లు ఈసీఐ తెలిపింది. 90,712 మంది బీఎల్‌ఓలు, 243 మంది ఈఆర్‌ఓలు సహా ఎన్నికల యంత్రాంగం ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా ఈసీనెట్ యాప్‌లోని బుక్-ఎ-కాల్ టు బీఎల్‌ఓ సౌకర్యం ద్వారా అందుబాటులో ఉంటుంది. డీఈఓ/ఆర్‌ఓ స్థాయిలో ఏదైనా ఫిర్యాదు, అభ్యంతరాలను నమోదు చేయడానికి కాల్ సెంటర్ నంబర్ (ఎస్‌టీడీ కోడ్) 1950 కూడా అందుబాటులో ఉందని గురువారం ఓ ప్రకటనలో ఈసీఐ తెలియజేసింది.