- అధికారిక లాంఛనాలతో పూర్తయిన మురళీనాయక్ అంత్యక్రియలు
- హాజరైన డిప్యూటీ సీఎం పవన్, లోకేశ్, అనిత, సవిత, సత్యకుమార్, అనగాని
నవతెలంగాణ-హైదరాబాద్: సత్యసాయి జిల్లా కళ్లితండాలో వీరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మురళీనాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేశ్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీరజవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.
మురళీనాయక్ తండాగా మారుస్తాం : నారా లోకేశ్
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన లోకేశ్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అదే విధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేశ్ అన్నారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కల్లితండాను మురళీనాయక్ తండాగా మారుస్తామని లోకేశ్ పేర్కొన్నారు. చిన్న వయసులో మురళీనాయక్ మృతి బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబానికి అండగా ఉంటాం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివదేహానికి నివాళులర్పించడానికి కళ్లితండాకు వచ్చిన పవన్ మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ మూడు పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు.