నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిలిప్పీన్స్‌ను శుక్రవారం ఉదయం భారీ భూకంపం వణికించింది. దేశంలోని మిందానావో ప్రాంతంలోని దావో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలో సముద్ర గర్భంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం ఉదయం 9:43 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఆ దేశ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఫివోల్క్స్) అధికారికంగా ప్రకటించింది. మనాయ్ పట్టణానికి తూర్పున సుమారు 62 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం ఉండవచ్చని ఫివోల్క్స్ హెచ్చరించింది. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.