Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబావ పొట్టిగా ఉన్నాడని అంతమొందించిన బావమరిది

బావ పొట్టిగా ఉన్నాడని అంతమొందించిన బావమరిది

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుడు పొట్టిగా ఉన్నాడన్న ఒక్క కారణంతో వధువు సోదరుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన కొన్ని రోజులకే జరిగిన ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడికి చెందిన కుర్రా నాగ గణేష్ (25), ఉద్యోగరీత్యా గుంటూరు సమీపంలోని బుడంపాడులో నివసిస్తున్నాడు. తెనాలికి చెందిన తన దూరపు బంధువుల అమ్మాయి కీర్తి అంజనీ దేవిని పెళ్లిచూపుల్లో కలిశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, గణేష్ పొట్టిగా ఉన్నాడని అమ్మాయి సోదరుడు దుర్గారావు, ఇతర కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయినా వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు.

పెద్దలను ఎదిరించి, సెప్టెంబర్ 25న ఇంటి నుంచి వెళ్లిపోయి అమరావతిలో వివాహం చేసుకున్నారు. అనంతరం బుడంపాడులో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట, రక్షణ కోరుతూ నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే అదే సమయంలో, తన బావను చంపేస్తానంటూ దుర్గారావు అందరి ముందే గణేష్‌ను హెచ్చరించాడు. ఈ హెచ్చరికలతో ఆందోళన చెందినప్పటికీ, గణేష్ పెద్దగా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు. గుడిలో పెళ్లి చేసుకున్నందున, గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందుకోసం తన స్నేహితుడు కరుణతో కలిసి గుంటూరుకు వెళ్లి, బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. పక్కా ప్రణాళికతో కాపుకాసిన దుర్గారావు, తన స్నేహితులతో కలిసి గణేష్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -