నవతెలంగాణ – అమరావతి: దేశ రక్షణలో భాగంగా జమ్మూకశ్మీర్ సరిహద్దులో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసి, జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరంట్ల మండలం కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, అమర జవానుడి భౌతికకాయం ఉన్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదిలించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రస్తావిస్తూ, అటువంటి దుశ్చర్యల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీనాయక్ వీరమరణం పొందారని తెలిపారు. చిన్నప్పటి నుండే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మురళీనాయక్ ఉండేవారని, “చనిపోతే భారత జెండా కప్పుకుని చనిపోతా” అని తరచూ అనేవారని మంత్రి గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి ఏకైక కుమారుడైన మురళీనాయక్, చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యంత బాధాకరమని అన్నారు. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు పోరాడుతున్నందునే దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
వీర జవాను మురళీ నాయక్ శవపేటిక మోసిన మంత్రి నారా లోకేశ్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES