నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి సిహెచ్ రాజా స్పష్టం చేశారు. శుక్రవారం మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లో నాని తన అనుచరులతో కలిసి పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని, ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ మేరకు చిలకలపూడి స్టేషన్‌లో సెక్షన్ 353,506 క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే..
శుక్రవారం వైసీపీ నేత సుబ్బన్నను ఓ కేసు విచారణ కోసం పోలీసులు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్‌చల్ చేశారు. సీఐతో పేర్ని నాని గొడవకు దిగారు. మెడికల్ కాలేజీ ధర్నా కేసులో తన అనుచరుడిని వేధిస్తున్నారని, విచారణ పేరుతో రోజూ స్టేషన్ కు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే తానంటే ఏమిటో ఏపీ పోలీసులకు చూపిస్తానని పేర్ని నాని హెచ్చరించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.