అంగన్వాడీలపై నిర్బంధకాండను ఖండిస్తున్నాం

– సర్కారు బెదిరింపులను మానాలి
– సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి
– తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ జేఏసీ నేతలు పి.జయలక్ష్మి, ఎన్‌. కరుణకుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పర్మినెంట్‌, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింపజేయడం, పెన్షన్‌ పెంపు వంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ జేఏసీ నేతలు పి.జయలక్ష్మి(సీఐటీయూ), ఎన్‌.కరుణకుమారి(ఏఐటీయూసీ) తెలిపారు. టీచర్లు, హెల్పర్లపై బెదిరింపులను మానుకోవాలని సూచించారు. సమ్మె డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రేడ్‌ యూనియన్‌ చట్టం 1926 ప్రకారం చట్టబద్ధంగా 14 రోజుల ముందు ప్రభుత్వానికి, సంబంధిత రాష్ట్ర అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. చట్టబద్ధంగా చేస్తున్న సమ్మెను అణచివేయాలని చూడటం సరిగాదని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. అంగన్వాడీ ఉద్యోగులను ఇండ్ల వద్దకెళ్లి మరీ అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన అప్రజాస్వామిక విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love