Wednesday, April 30, 2025
HomeUncategorizedక‌ళ‌మాన‌వ‌త్వా‌నికి అంకితం

క‌ళ‌మాన‌వ‌త్వా‌నికి అంకితం

అంజలి ప్రభాకర్‌… అనేక కళారూపాలను తన చిత్రాల్లో ప్రతిబింబించగల బహుముఖ ప్రతిభాశాలి. చిత్ర కళలోనే కాదు సంగీతం, నృత్యం వంటి వాటిల్లో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. అయితే తన చిత్రకళకు మాత్రం ఒక నూతన శక్తిని అందిస్తోంది. జీవిత తత్త్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం వల్ల ఆమె కళలో అంతరార్థం, స్పష్టత, సున్నితమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. ఫ్యాషన్‌ ఆర్ట్‌లో మాస్టర్స్‌తో పాటు మానసికశాస్త్రం, మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసిన ఆమె చిత్రాల సౌందర్యం, భావ వ్యక్తీకరణలో మరింత పరిపక్వత ప్రతిఫలించింది. ఈనెల 4,5,6 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో తన కళాఖండాలను ప్రదర్శించడానికి వచ్చిన ఆమె గురించి క్లుప్తంగా…
1975 ఫిబ్రవరి 15న బీహార్‌లో జన్మించిన అంజలి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థిరపడ్డారు. భోపాల్‌ అనేక కళారూపాలకు కేంద్రంగా నిలిచి ఆమె కళకు కొత్త స్ఫూర్తినిచ్చింది. ఆమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌, ఎం.బి.ఏ (హ్యూమన్‌ రీసోర్సెస్‌) పూర్తి చేసి 1993 నుంచి చిత్రకళలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నారు. లియోనార్డో డా విన్చీ, రాజా రవి వర్మ, ఫ్రిడా కాలో వంటి మహా కళాకారులు ఆమెకు ప్రేరణగా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఇనోవేటివ్‌ సంస్థకు ఎండీగా ఉన్నారు. మరోవైపు ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్‌గా అద్భుతమైన కళారూపాలను సృష్టిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో…
కళా ప్రపంచంలో తన ప్రాముఖ్యతను చాటుకుంటున్నారు అంజలి. ఆమె కళలోని సమతుల్యత రంగుల సమన్వయం, ఆకారాల నిర్మాణం, కథనంతో కూడిన వినూత్న దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికత, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలు వంటి అనేక అంశాలను తన చిత్రాల్లో భావోద్వేగంతో చిత్రికరించారు. అందుకే ఆమె చిత్రాలు కళాభిమానులను, కళా సేకరణ కర్తలను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆమె కళా కృతులు భారతదేశంతో పాటు అంతర్జాతీయ కళా ప్రపంచంలో ప్రాముఖ్యత పొందాయి.
కళా ప్రదర్శనలు, ప్రచురణలు
అనేక సోలో, గ్రూప్‌ ప్రదర్శనల ద్వారా ఆమె చిత్రకళ కళా ఆరాధకులకు పరిచయమైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75కు పైగా ప్రదర్శనల్లో పాల్గొని, విశేష గుర్తింపు పొందారు. అనేక పత్రికలు, మ్యాగజైన్లు, ఆర్ట్‌ జర్నల్‌లు ఆమె కళను విశ్లేషిస్తూ ప్రచురించాయి. ఆమె కళా ప్రయాణాన్ని వివరించే Tunes of Life అనే పుస్తకం కూడా వెలువడింది. ప్రస్తుతం ఆమె ‘ఆర్ట్‌ థెరపీ మహిళల మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తుందో’ అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img