Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఉద్రిక్తత..

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఉద్రిక్తత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేయ మార్పిడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందడంతో, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా డబ్బులు వసూలు చేసి, చివరికి ప్రాణాలు తీశారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, కుత్బుల్లాపూర్‌కు చెందిన మురళీధర్ (40) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం 45 రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు చెప్పడంతో, అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మురళీధర్ వయసు 40 ఏళ్లు కాగా, ఆసుపత్రి సిబ్బంది పొరపాటున 60 ఏళ్లుగా నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ తప్పిదం వల్ల అవయవదాతలు ఎవరూ ముందుకు రాలేదని, దీంతో చివరికి అతని భార్యే కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చారని వారు తెలిపారు.

ఈ 45 రోజుల చికిత్స కోసం తాము సుమారు రూ.85 లక్షలు చెల్లించామని, ఉన్న ఒక్క ఇంటిని అమ్మి డబ్బు కట్టామని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, శనివారం మరో రూ.14 లక్షలు చెల్లించిన తర్వాతే మురళీధర్ మృతి చెందినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. డబ్బు కట్టించుకున్న తర్వాత మరణవార్త చెప్పడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యుల నిర్లక్ష్యం, జీవన్‌దాన్‌లో తప్పుడు సమాచారం నమోదు చేయడం వల్లే మురళీధర్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -