నవతెలంగాణ – హైదరాబాద్ : వైద్య విద్యార్థిని లైంగికదాడి కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సింది పోయి.. అర్థరాత్రి ఆ అమ్మాయి బయటకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. ఉత్తర బెంగాల్‌లో సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షించేందుకు వెళుతున్న ఆమెను కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినులు హాస్టల్ నిబంధనలను పాటించాలని ముఖ్యంగా రాత్రి పూట బయటకు వెళ్లకూడదని అన్నారు. వారి ఇష్టానుసారంగా వెళ్లే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ.. వారు అర్థరాత్రి బయటకు వెళ్లకూడదని అన్నారు.
ఇది ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన అని, నిందితులను విడిచిపెట్టేది లేదని అన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారని, మరో ఇద్దరు కోసం గాలిస్తున్నామని అన్నారు. నిందితులను వదిలిపెట్టేది లేదని అన్నారు. సంస్థ కూడా ఈ సంఘటనకు బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు తమ క్యాంపస్‌ల లోపల మరియు చుట్టుపక్కల భద్రతను నిర్థారించుకోవాలని అన్నారు. పోలీసులకు కొన్ని పరిమితులున్నాయని, రాత్రి ఎవరు ఇంటినుండి బయటకు వెళుతున్నారో అధికారులకు తెలియదని, ప్రతి ఇంటి ముందు కాపలాగా ఉండలేరని సెలవిచ్చారు.