నవతెలంగాణ-హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 5.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కాంగ్రెస్ నేత అయిన కొండా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డికి మనమడు. తాత ఆశయాలతో రాజకీయ జీవితంలోకి వచ్చిన ఆయన ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు. ఏపీ క్రీడా మండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ నుంచి కూడా పోటీ చేశారు.
ఇక కొండా లక్ష్మారెడ్డికి జర్నలిజం మీద కూడా మక్కువ ఎక్కువ. అందుకే 1980లో ఆయన స్థానిక వార్త సంస్థ NSS ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు.