నవతెలంగాణ-హైదరాబాద్ : పొలంలో పని చేస్తున్న తాతకు తాగునీరు తీసుకెళ్తున్న ఐదేళ్ల చిన్నారిపై చిరుత పులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పింపార్ఖేడ్ గ్రామంలో ఆదివారం తమ ఇంటి సమీపంలోని పొలంలో పని చేస్తున్న తాతకు మంచినీళ్లు ఇవ్వడానికి శివన్య శైలేష్ బొంబే అనే ఐదేళ్ల చిన్నారి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే నక్కిఉన్న చిరుతపులి ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేసి పొలాల్లోకి ఈడ్చుకుపోయింది.
దీన్ని గమనించిన అక్కడే పనిచేస్తున్న కొందరు వ్యక్తులు కర్రలతో చిరుతను తరమడంతో కొద్ది దూరంలో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా చిన్నారి మెడకు తీవ్ర గాయాలవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగించామని.. 10 బోన్లు ఏర్పాటుచేశామని ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. సోమవారం ఉదయం చిరుత బోనుకు చిక్కిందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. క్రూరమృగాల దాడిలో మరింత ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.