నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లపై.. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ హఠాత్తు పరిణామంపై తేజిస్వీ యాదవ్ స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రి చిరస్మరణీయ సేవలు అందిచారని, ఆయన గురించి దేశానికి, బీహార్ ప్రజలకు వాస్తవాలు తెలుసా అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
సీబీఐ నమోదు చేసిన కేసుపై తాము న్యాయస్థానంలో పోరాటం చేస్తామని, ఎన్నికల వేళ ఈ తరహా కేసులు నమోదు కావడం సహజమేనని, అయినా తాము కోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తామన్నారు. బీహార్ ప్రజలు చైతన్యవంతులని, ఏం జరిగింతో,వాస్తవాలేంటో వారికి తెలుసు అని చెప్పారు. ఈ తరహా కేసులన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలని విమర్శించారు. రైల్వే మంత్రిగా లాలూ రూ. 9వేల కోట్లతో రైల్వేశాఖను లాభాల బాట పట్టించారని, ప్రతి బడ్జెట్ లో ఛార్జీలు తగ్గించారని తెలియజేశారు. లాలును చారిత్రాత్మక రైల్వే మంత్రిగా పిలుస్తారు. బీహార్, దేశ ప్రజలకు నిజం తెలుసు. తాను సజీవంగా ఉన్నంత కాలం నేను బీజేపీతో పోరాడుతూనే ఉంటాను అని యాదవ్ విలేకరులతో అన్నారు.
కాగా,ఇటీవల బిహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.