– మరో మూడ్రోజుల్లో వాహన సామర్థ్య పరీక్షలు షురూ
– రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23వేల స్కూల్ బస్సులు
– ప్రతి యేడూ మొక్కుబడిగానే తనిఖీలు.. ఎఫ్‌సీల జారీ
– స్కూల్ యాజమాన్యాలతో ముందస్తు సమావేశాలకు ఏర్పాట్లు
– రోడ్డు భద్రత, నిబంధనలపై అవగాహనా కార్యక్రమాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులను బడులకు చేరవేసే బస్సుల ఫిట్‌నెస్‌పై రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక నజర్ పెట్టింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఫిట్‌నెస్ లేకుండా విద్యాసంస్థల బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 15తో స్కూల్, కాలేజ్ బస్సుల ఫిట్‌నెస్ ముగియనుంది. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను నిర్ణీత సమయంలోపు ఫిట్‌నెస్ చెక్ చేయించుకోవాలి. కానీ ఏటా అది సరిగ్గా అమలు కావడం లేదు. ఫలితంగా వందలాది బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా.. ఎఫ్‌సీలు లేకుండా రోడ్డెక్కుతున్నాయి. ఆ తర్వాత ప్రమాదాలు జరిగో.. అధికారుల తనిఖీల్లోనూ పట్టుబడుతున్నాయి. అయితే ఈ ఏడాది రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు విద్యాసంస్థల యాజమాన్యాలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి.. అందులో పిల్లలు భద్రత, ఫిట్‌నెస్, రోడ్డు సేఫ్టీపై వారికి అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత ఫిట్‌నెస్ లేకుండా దొరికితే బస్సులను సీజ్ చేయడంతో పాటు సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తారు.
రాష్ట్రంలో దాదాపు 28వేలకుపైగా విద్యాసంస్థల బస్సులుండగా.. వీటిలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో 13వేల వరకు పాఠశాలలు, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో కాలం చెల్లిన బస్సులు మినహాయిస్తే.. రాష్ట్రంలో 23వేలకుపైగా బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే విద్యాసంస్థలకు చెందిన ప్రతి బస్సు ఫిట్‌నెస్ తనిఖీలకు వచ్చి, సర్టిఫికెట్ పొందేలా యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోని వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బస్సులతోపాటు వ్యాన్లు, ఆటోలపై కూడా దృష్టిపెట్టనున్నారు. వాటి డ్రైవర్లకు కూడా ఫిట్‌నెస్, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటిలో డ్రైవర్లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. కాగా గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంవీఐ, ఏవీఎంఐ, కానిస్టేబుల్స్, హౌంగార్డులతో కూడిన ప్రత్యేక బృందాలు స్కూల్, కాలేజ్ బస్సులను తనిఖీ చేస్తారు.
ప్రతి బస్సు ఆఫీస్‌కు రావాల్సిందే..!
గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులు 23వేలకుపైగా ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుంది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు పాటించినా గతేడాది పలు విద్యాసంస్థలకు చెందిన వందలాది బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి కార్యాలయానికి రాలేదు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఫిట్‌నెస్ డ్రైవ్ చేపట్టినా కొన్ని బస్సులు దూరంగా ఉన్నాయి. చాలావరకు దొంగచాటుగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సుల నంబర్లు పెట్టుకొని రోడ్లపై తిరుగుతున్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో కూడా అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వాహనాలు కార్యాలయాలకు రాకుండానే వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇటువంటి ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు గ్రేటర్ పరిధిలోని అధికారులతో పాటు రాష్ట్రంలోని ఆయా అధికారులు తమ జిల్లాల పరిధిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం ప్రతి వాహనం కార్యాలయానికి రావాల్సిందేనని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
రూల్స్ ఇలా..
నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పాఠశాల, కళాశాల బస్సులకు రవాణా శాఖ సామర్థ్య పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా.. బ్రేకులు, ఇంజిన్ పనితీరు, డోర్లు, డ్రైవర్ అనుభవం తదితర అంశాలను పరిశీలిస్తారు. డ్రైవర్‌కు కనీసం ఐదేండ్ల అనుభవముండాలి. డ్రైవర్ లైసెన్స్‌తోపాటు క్లీనర్ ఫొటోలు, ఫోన్ నంబర్లు వాహనంలో ఉన్నాయా లేదా చూస్తారు. ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే లెక్కని, వారి తల్లితండ్రుల ఫోన్ నంబర్లు సహా బస్సులో అతికించాలి. బస్సు రూట్‌మ్యాప్‌ని ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. పదిహేనేండ్లు దాటిన వాహనాలను అనుమతించరు. విద్యాసంస్థల బస్సులకు పసుపురంగు వేసి నాలుగు వైపులా ఆర్టీఏ రిజిస్టేష్రన్ నంబర్ రాయాలి. కొత్త టైర్లతోపాటు స్టెప్నీ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తప్పనిసరి. వర్షంపడితే నీళ్లు లోపలికి రాకుండా ఉండేందుకు బస్సు టాప్‌పై సీలింగ్ ఉండాలి. ప్రతి మూడునెలలకోసారి డ్రైవర్ వైద్య పరీక్షలు చేసుకోవాలి. ఈ ఖర్చు యాజమాన్యమే భరించాలి. అలాగే డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. ఇలా మొత్తం 30-40 నియమ నిబంధనలను పాటించిన బస్సులకు మాత్రమే ఎఫ్‌సీ మంజూరు చేస్తారు.
విద్యాసంస్థల బస్సులపై నజర్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES