నవతెలంగాణ-హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, జెడి(ఎస్)నేత హెచ్‌డి దేవగౌడ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం గతవారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత సోమవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వల్ల చలి జ్వరంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 7వ తేదీ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వైద్యులు ఆయనను ఐసియులో ఉంచి చికిత్సనందించారు. ఆరోగ్యం మెరుగుపడగానే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే మరో 15 రోజులు దేవెగౌడను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారని, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు తనని కలవడానికి నివాసానికి రావొద్దని అభ్యర్థిస్తూ జెడి(ఎస్) సోమవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వయంగా ఆయనే జెడి(ఎస్) పార్టీ ప్రధాన కార్యాలయం జె.పి భవన్‌కి వచ్చి అందరినీ కలుస్తారని ఆ పార్టీ ఎక్స్ పోస్టులో తెలిపింది.