– ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మితవాద ధోరణులు
– మితిమీరుతున్న సంఘ్ నేతల జోక్యం
– హిందూత్వ భావజాలంతో కోర్సులు
వర్సిటీలో మార్పులు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జనవరి 22న జరిగిన ఓ కార్యక్రమం వేదికపై ‘హిందూ రాష్ట్ర’, ‘జై శ్రీరామ్’ అని రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ ఏర్పాటు చేసింది. 2023 మార్చిలో వర్సిటీ అనుబంధ ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమన్ క్యాంపస్ గోడలకు కాషాయరంగు పూశారు. దానికి అనుగుణంగా ఉండేలా కళాశాల లోగోను కూడా మార్చేశారు. వర్సిటీ ఉత్తర క్యాంపస్‌లో ఉన్న కిరోరిమల్ కళాశాలలో హిందూ నూతన సంవత్సర వేడుకల కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఎంపికలు సైద్ధాంతిక వివక్షకు అద్దం పడుతున్నాయి. 2023లో స్వతంత్ర హిందూ అధ్యయనాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మాస్టర్ డిగ్రీని ఆఫర్ చేస్తోంది. ఈ సెంటర్‌లో పీహెచ్‌డీ కోర్సును కూడా ప్రారంభించాలని వర్సిటీ యోచిస్తోంది. గత సంవత్సరం డిసెంబరులో ఐదు విలువ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టాలని వర్సిటీ ప్రతిపాదించింది. వీటిలో నాలుగు కోర్సులు భగవద్గీతకు సంబంధించినవే. 2023లో మహమ్మద్ ఇక్బాల్‌పై పాఠ్యాంశాన్ని తొలగించి, వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కొత్త కోర్సును ప్రారంభించారు. సావర్కర్ పేరిట ఓ కొత్త కాలేజీని ప్రారంభిస్తున్నామని యూనివర్సిటీ ప్రకటించింది. దానికి ప్రధాని మోడీ జనవరిలో స్వయంగా భూమిపూజ చేశారు. జనవరి 9, 10 తేదీలలో మోడీ విదేశాంగ విధానంపై యూనివర్సిటీ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. మార్చి 17-29 తేదీల మధ్య వర్సిటీ ప్రాంగణంలో అనేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు బీజేపీ నేతలు వక్తలుగా హాజరయ్యారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష వత్సల గత నెలలో తన చర్యల ద్వారా వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. వేసవి వేడికి చల్లబరచడానికి తరగతి గది గోడలపై ఆమె ఆవు పేడను పూశారు. పైగా ఇది సంప్రదాయ దేశీ పద్ధతి అంటూ తన చేష్టను సమర్థించుకున్నారు.
తన పరిశోధనలో ఇది ఓ భాగమని సర్దిచెప్పుకునేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ చర్య అశాస్త్రీయమని విద్యార్థులు, అధ్యాపకులు ముక్తకంఠంతో నిరసించారు. ప్రిన్సిపాల్ చర్యను తిప్పికొడుతూ కొందరు విద్యార్థులు ఆమె కార్యాలయం గోడపై ఆవు పేడను అలికారు.
కార్యక్రమాలన్నీ వారివే
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సైద్ధాంతిక ఘర్షణలలో ఇది తాజా ఘటన. ఒకప్పుడు విభిన్న అభిప్రాయాలకు వేదికగా నిలిచిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు మితవాద ధోరణులు ముందుకు తేవడంలో ముందు వరుసలో నిలుస్తోంది. వివాదాస్పద నియామకాలు, సిలబస్‌లో మార్పులు వంటివి దాని ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో సంబంధమున్న వారు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ మొత్తం కాషాయమయమైంది. వివిధ కార్యక్రమాలలో ప్రసంగిస్తున్న వక్తల ఎంపికను చూస్తుంటే సైద్ధాంతిక దిశ మారుతోందని అర్థమవుతోంది. అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు తరచుగా విశ్వవిద్యాలయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గతంలో కూడా ఇలా జరిగేది కానీ ఇప్పుడు ఆ ధోరణి బాగా పెరిగిపోయింది. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు కూడా ఓరియంటేషన్, రిఫ్రెషర్ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్నారు. గత నెల 2న జరిగిన ఓ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ హాజరు కావడం విద్యార్థుల నిరసనకు దారితీసింది. గత నెల 30న జరిగిన మరో కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రి అశిష్ సూద్ కూడా హాజరయ్యారు.
కాషాయీకరణను పట్టించుకోరా?
గత నెల 3వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్ విభాగమైన రాష్ట్రీయ సేవా భారతి ‘రన్ ఫర్ ఎ గర్ల్ ఛైల్డ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో అధ్యాపకులందరూ పాల్గొనాలని ఓ సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై అధ్యాపక వర్గం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ తరచూ సీనియర్ రాజకీయ నేతలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని అప్పటి అధ్యాపకులు గుర్తు చేశారు. అయితే 2023 మేలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూనివర్సిటీకి చెందిన హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడాన్ని పాలక మండలి తప్పుపట్టింది. రాహుల్‌కు నోటీసు కూడా ఇచ్చింది. కానీ పలువురు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వర్సిటీని కాషాయీకరణ చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థులు, అధ్యాపకులు మండిపడుతున్నారు. తాజాగా గత నెలలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ‘ది హిందూ మ్యానిఫెస్టో’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వర్సిటీలో జరగకపోయినా దానికి వైస్ ఛాన్సలర్ హాజరయ్యారు.
కాషాయం పులుముకున్న క్యాంపస్!
- Advertisement -
- Advertisement -