బాల సాహిత్యంలోనూ ఓరుగల్లుది శిఖరాయ స్థానం. తొలి నుండి ఈ నేల బాల సాహితీ సృజనకారులకు ఆలవాలంగా నిలిచింది. తన పోరు వారసత్వంతో పాటు సాహిత్య సంస్కృతిని అందించింది. అది ఈ వేదికగా గతంలో అనేకమంది రచయితలు, కవులు, బాల వికాస కార్యకర్తలను గురించి రాసుకున్నప్పుడు చదువుకున్నాం కూడా. అలా ఈ నేల మీద పుట్టి ఉద్యోగరీత్యా భారత రక్షణ విభాగం లోని సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన రచయిత, వ్యాసకర్త, బాల సాహితీవేత్త డా. చిట్యాల రవీందర్. వీరు 3 మే, 1963 న వరంగల్ కరీమాబాద్ రోడ్‌లోని ఎస్.ఆర్.ఆర్. తోటలో పుట్టారు. శ్రీమతి చిట్యాల ఉపేంద్రమ్మ – శ్రీ వెంకటాచలం రవీందర్ తల్లితండ్రులు. వరంగల్ లోని సరస్వతీ శిశు మందిర్, మహబూబియా హైస్కూల్‌లలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బి.టెక్., ఎం.ఎల్.ఎంలతో పాటు పిహెచ్.డి.లను జె.ఎన్.టి.యు, హైదరాబాద్, మీరట్‌లలో పూర్తిచేసిన వీరు భాత రక్షణ విభాగం లోని సి.ఎస్.డి.లో డిప్యూటి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
కవిగా ‘భారతి’ పత్రికతో ఆరంగేట్రం చేశారు డా. చిట్యాల రవీందర్. వీరి తొలి కవిత ‘పాపం సూరన్న’ భారతిలో రావడం విశేషం. కవిత్వంతో పాటు లలిత గీతాలకర్తగా, రచయితగా వివిధ పత్రికల కోసం పలు రచనలు చేశారు. వీరి లలిత గీతాలు దూరదర్శన్‌లో ప్రసారం కాగా, స్వాతి సపరివార పత్రికలో దాదాపు ముప్పైకి పైగా ప్రత్యేక ఫీచర్ రచనలు చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ ‘భావన’ ద్వారా ఇరవైకి పైగా రేడియో ప్రసంగాలు చేశారు. నాటక రచయితగా కూడా వీరు ప్రసిద్ధులు. వీరు రాసిన ‘ఆశకు హద్దు’, ‘తృప్తి’, ‘మనిషికి మనిషికి మధ్య’, ‘వైకుంఠపాళి’ నాటికలు కూడా ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. బాలల సాహిత్యం బాలలకు వినోదం, విజ్ఞానాలతో పాటు నైతిక విలువల పెంపుదల, బాల్యం నుండే మంచి చెడ్డలు తెలుసుకోవడంతో పాటు తద్వారా వారి వ్యక్తిత్వ వికాసం జరగడం కోసం తన కథలు ఉపయోగపడతాయని చెప్పడమే కాక తాను అందుకోసమే బాల సాహిత్య రచనలు చేస్తానని చెప్పే చిట్యాల రవీందర్ బాలల కథలు సామాజిక స్పృహకలిగి ఉండాలని, ప్రశ్నించే తత్తాన్ని పెంచాలని, విస్తృతమైన అంశాలతో పాటు చక్కని భాష ఉండాలని కోరుకుంటారు. కేవలం ఫిక్షన్ రచనలే కాక విజ్ఞానశాస్త్రం, పర్యావరణం, సామాజిక సమస్యలు, స్నేహం, కుటుంబ విలువలు వంటివి రచనల్లో ఉండాలని కోరుకుంటారు. ఈ కోణంలోనే ఆయన తన బాలల కథలను కూడా మలిచే ప్రయ్నతం చేశారు.
దాదాపు అన్ని ప్రధాన తెలుగు పత్రికల్లో వీరి కథలు వచ్చాయి. ముఖ్యంగా నవ తెలంగాణ, మొలక, ఈనాడు హారు బుజ్జీ, సాక్షి, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్రల్లో అచ్చయ్యాయి. తనే చెప్పినట్టు రచనల్లో వైజ్ఞానిక లేదా టెక్నాలజీకి సంబంధించిన విషయాలను సందర్భానుసారంగా చెప్పడం మనం చూడవచ్చు. ‘మా మంచి మాస్టారు..’ కథ అటువంటిదే. ఇందులోని ఉపాధ్యాయుడు పిల్లలకు పువ్వును మాట్లాడిస్తూ సాంకేతిక విప్లవం తెలిసేలా చేస్తాడు. గ్రీన్ ఎనర్జీని పరిచయం చేస్తాడు. విద్యుత్తు గురించి, సౌరఫలకాల గురించిన మరెన్నో చక్కని విషయాలను తెలియజేస్తాడు. మంచి ఉపాధ్యాయునిగా పిల్లల మనసుల్లో నిలిచిపోతాడు. అటు వినోదం, ఇటు విజ్ఞానం, చక్కని కథనం ఉంటే ఏ కథలైనా పిల్లలకు నచ్చుతాయి. పిల్లలది స్వతంత్ర మనస్తత్వ్తం మనం చెప్పే విషయాలు కొన్నింటిని కావాలని వాళ్ళు వినిపించుకోరు కదా! ఈ విషయాన్ని గురించి చక్కని కథ చెప్పారు డా.చిట్యాల రవీందర్. కథలోని గోపికి తాత సుబ్బారావు బాల్యం నుండి చెట్లు, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం గురించి చెప్పడంతో వాటిపట్ల ప్రేమ పెంచుకుంటాడు. ఒకనాడు ఒక చక్కని పూల మొక్క తెచ్చి ఇస్తాడు. గోపి దానిని చక్కగా పెంచుతాడు. ఒకరోజు అది గాలికి విరిగిపోతుంది. తాత చెప్పినట్టు కట్టుకట్ది మళ్ళీ పెంచుతాడు. మరోసారి పసువులు తినేస్తాయి. చివరకు చక్కని కంచె ఏర్పాటుచేసి దానిని కాపాడుతాడు. ఇదీ కథ… నిజానికి మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ఈ కథ పేరు ‘మొక్క పెంపకం’. నీటి విలువను, సౌభ్రాతృత్వాన్ని ‘నీరు అమృతపాయం’ కథ చెప్పగా, ‘మిత్రలాభం’ కథ బలంతో విర్రవీగి ఇతరులతో విరోధం తెచ్చుకుంటే జరిగే పర్యవసానాల గురించి చెబుతుంది. ఇందులో జింక, సింహం పాత్రలు. దీని కూడా చక్కని సంభాషణలతో నడిపించాడు రచయిత రవీందర్.
గర్వం, అలోచనలు లేకపోవడం వంటివి ఎటువంటి అనర్థాలు తెస్తాయో చెప్పే కథ ‘చిరుత గర్వభంగం’. ఇందులోని పులికి తన బలం పట్ల గర్వం. ఆ గర్వం, పొగరుతో ఇతర అన్ని ప్రాణుల్ని చులకనగా మాట్లాడుతుంది. అక్కడే ఉండి ఇదంగా విని సహించని ముళ్ళపంది చిరుతను అసలు పట్టించుకోదు. దాంతో పులి ముళ్ళపంది వైపు వెళుతుంది. ఇది చూసిన నక్క ఎంత వారించినా పులి వినదు. అంతే ఒక్క ఉదుటున ముళ్ళపంది పైన పులి లంగిస్తుంది. అంతే.. ముళ్ళు గుచ్చుకుని పులి శరీరమంతా రక్తసిక్తం అవుతుంది. ఇదీ ఈ కథ. అనుకుంటే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి కూడా! తన రచనలకు వినోదం, విజ్ఞానంతో పాటు వాటికి హేతువును జోడించి చెప్పే ఈ బాలల కథకుని కథలు పిల్లలకు నచ్చుతాయనడంలో సందేహం లేదు. చక్కని కథకుల పోరుగల్లు ఓరుగల్లు కథకునికి అభినందనలు. జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్
9966229548