నవతెలంగాణ-కామారెడ్డి: జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్‌గా సుమారు 27 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి, పదవీ విరమణ పొందుతున్న వడ్ల లక్ష్మీపతికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర లక్ష్మీపతిని పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున లక్ష్మీపతికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్ వడ్ల లక్ష్మీపతి పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు అత్యంత నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వహించి శాఖకు ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ఆయన చూపిన క్రమశిక్షణ, పనితీరు తోటి సిబ్బందికి ఆదర్శమని, ఆయన చేసిన సేవలు పోలీస్ శాఖలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం లక్ష్మీపతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ తరఫున తగిన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.నరసింహారెడ్డి, ఆర్ఐ నవీన్ కార్యాలయ సిబ్బంది పాల్గొని లక్ష్మీపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. లక్ష్మీపతి కుటుంబ సభ్యులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.



