Friday, May 23, 2025
Homeతాజా వార్తలుఅచ్యుతాపురం కాల్‌ సెంటర్ల కేసులో 33 మంది అరెస్టు

అచ్యుతాపురం కాల్‌ సెంటర్ల కేసులో 33 మంది అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్‌ క్రైం కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని టెక్నాలజీ సాయంతో వంచనలకు పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకున్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి 33 మందిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు ఎస్‌పి తుహిన్‌ సిన్హా తెలిపారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అచ్యుతాపురంలోని మూడు ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ పరికరాలు, డిజిటల్‌ సదుపాయాలు, రూ.3.లక్షల నగదు, పలు వాహనాలు, ఫర్నీచర్‌ స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ ముఠా విభజిత బాధ్యతలతో కూడిన వ్యవస్థగా ఉంది. డైలర్లు, వివో, ఐపిఎల్‌ కాల్స్‌ ద్వారా అమెరికా పౌరులను సంప్రదించి అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి తాము మాట్లాడుతున్నట్టు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. అమెరికా బ్యాంకులు లేదా ఎఫ్‌టిసి అధికారులుగా నటించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పొందడం, బాధితులతో గిఫ్ట్‌ కార్డులు కొనుగోలు చేయించి, వాటి కోడ్‌లు చెప్పించడం తదితర చర్యలకు పాల్పడుతున్నారు. అసోం, నాగాలాండ్‌, మేఘాలయ, గుజరాత్‌ రాష్ట్రాల నుండి ఉద్యోగులను నియమించి సైబర్‌ మోసాల పట్ల శిక్షణ ఇచ్చి బాధితులను లక్ష్యంగా చేసుకుని నెలకు కోట్ల రూపాయలు దోచుకున్నట్టు గుర్తించారు. ముఠాలో కీలక వ్యక్తులుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన పునీత్‌ గోస్వామి, రాజస్థాన్‌కు చెందిన అవిహాంత్‌ దాగాను అరెస్టు చేశారు. ఈ ముఠాను నడిపిస్తున్న ప్రముఖ వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని ఎస్‌పి తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్‌పి ఎం.దేవప్రసాద్‌, పరవాడ డిఎస్‌పి విష్ణు స్వరూప్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -