– రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
– విమర్శలు మాని రైతులను పట్టించుకోండి: మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాసులను వదిలేసి సర్కారు అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సన్నవడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.512 కోట్లు పెండింగ్‌లో ఉందనీ, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోజుల తరబడి కేంద్రాల్లో మూలుగుతోందని అయినా అవేమీ పట్టని సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామనీ హామీ ఇచ్చిన సర్కారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కూడా చేయలేదనీ, కొన్న వడ్లకు రూ.4 వేల కోట్ల బకాయి పెట్టిందని చెప్పారు. 48 గంటల్లో డబ్బులు చెల్లింపు ఒట్టి మాటేననీ, 10 రోజులైనా కొన్న పంటలకు డబ్బులు దిక్కులేవని చెప్పారు. యాసంగి పంటకు రూ.512 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. కోతలు అయిపోయినా యాసంగి సాయం ఇంకా అందించలేదన్నారు. పంట పెట్టుబడి, కొన్న ధాన్యాన్ని తరలించడం, ధాన్యం అమ్మాక రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు సమకూర్చడం, ధాన్యాన్ని లారీల్లోకి ఎక్కించడం, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం, బోనస్ అందించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
రూ.4 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు?
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిపడ్డ రూ.4 వేల కోట్లను ఎప్పటిలోగా చెల్లిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే, బకాయిలున్నాయని తెలిపారు. సన్న వడ్లకు రూ.767 కోట్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. చనిపోయిన రైతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అవి ప్రభుత్వ హత్యలే
తరుగు తీయబోమని మాటిచ్చిన సర్కారు ఆ మాట నిలబెట్టుకోలేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు క్వింటాల్‌కు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్ ట్రక్ షీట్ విధానం అమలు చేయడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఎండలో రోజుల తరబడి వేచి చూసి రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 13న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో గుగులోతు కిషన్, ఏప్రిల్ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో జలపతి రెడ్డి, ఏప్రిల్ 21న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు చెర్లపాలెంలో హనుమండ్ల ప్రేమలత, ఏప్రిల్ 22న నెల్లికుదురు మండలం మదనతుర్తిలో బిర్రు వెంకన్న, ఏప్రిల్ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో చింతకింది హనుమయ్య మరణించారని తెలిపారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేననీ, కేవలం కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవేనని మండిపడ్డారు. ఫిబ్రవరి నెలలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.
అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ధాన్యం రాసులు పట్టని ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES