తెలుగు సాహిత్యంలో ఆత్మకథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఎంతటి గొప్ప వ్యక్తులైన ఆత్మకథలు రాసుకోవాలంటే ఒకింత సంఘర్షణకు లోనవుతారు. ఎందుకంటే ఏ వ్యక్తి జీవితం కూడా తమ ఒక్కరిదే కాదు. వ్యక్తి జీవితం.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సమాజంలోని ఇతర వ్యక్తులు, సంస్థలతో ముడిపడి వుంటుంది. వీరందరి గురించి ప్రస్తావించే సమయంలో వాస్తవాలను మాత్రమే రాయవలసి వచ్చినపుడు కొందరు ఇబ్బందిపడే అవకాశం లేకపోలేదు. కొందరు మెచ్చుకున్నా.. కొందరు నొచ్చుకోనూవచ్చు. కొందరు తమ గురించి అతిశయించి చెప్పనందుకు చిన్నబుచ్చుకోనూవచ్చు..
అయినను రాయవలె.. ఈ ప్రపంచానికి ఎంతో అక్కెర అయిన వ్యక్తులు.. తమ తమ ఆత్మ కథలు రాసే తీరవలె. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యగా ఎదిగినందుకు.. ఈ సమాజంలో మిగిలిన వ్యక్తులకన్నా తాను ఉన్నతమైన శిఖరాలకు చేరుకున్నందుకు.. తన వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నందుకు.. ఆ జీవనపథంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను అందరూ తెలుసుకునేందుకు ఇలాంటి ఆత్మకథలు రాసే తీరవలె.
అందరివలె ఆమె కూడా సాదా సీదా చదువులు చదువుకుని, సాధారణ మహిళలా పెళ్ళిచేసుకుని, పిల్లలను కని, అతను నవ్వితే నవ్వి, ఏడ్పిస్తే ఏడ్చి.. కొడితే పడి.. తెస్తే తిని, తేకుంటే పస్తులుండి.. కొంగు తడిచేలా ఏడ్చుకుని.. గుమ్మం లోపలే పడి వుండక.. తన ప్రధమ, అంతిమ లక్ష్యాలన్నీ విద్యా ఉద్యోగాలుగా చేసుకుని, గడపదాటి.. ఎన్ని కుదుపులున్నా మలుపులెన్నో తిరిగి, ఎన్ని అవరోధాలున్నా ఒక్కో మెట్టు ఎక్కి.. స్వయంసిద్ధగా మారడం వెనుక ఎంత యాతన, ఎంత గొప్ప కషి వుందో వారి మాటల్లోనే తెలిపి తీరాలి. ఎందుకంటే ఆ పరిస్థితులను ఎదుర్కొన్న వ్యక్తి తానే స్వయంగా ఆ వాస్తవాలను వివరిస్తే వాటికి ఒక కచ్చితత్వం వుంటుంది. మనమెంతో అభిమానించే, గౌరవించే, మన ముందే వున్న ఒక అపురూప వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని దీప్తివంతం చేసిన పరిస్థితులు తెలుసుకోవడంలో చదువరులు ప్రేరణ పొందడానికి వీలుంటుంది. అందుకనే ఇలాంటి మాన్వీ తన ఆత్మకథ రాసే తీరాలి.
కొందరికి తాను చెప్పదలచుకున్న విషయాలకు తనకున్న కొన్ని జ్ఞాపకాలే తప్ప చూపించుకోను ఆధారాలు వుండవు. అయినను రాయవలే.. జ్ఞాపకాలను ఛాయా చిత్రాలలో చూపిస్తూ ఛాయా చిత్రాలలో లేని వాటికి చిత్రాలు గీయిస్తూ.. చెప్పదలచుకున్న అనేకానేక విషయాలను ఒక క్రమంలో పేరుస్తూ అమతలతగారివలే చెప్పేతీరాలి.
మనజీవితంలో మన ప్రమేయం లేకుండా ఎన్నెన్నో జరిగిపోయినప్పుడు.. మన జీవిత చిత్రానికి తోచిన వారు తోచిన వర్ణాలు పులమక ముందే, ఉన్నది వున్నట్టుగా ముందో వెనకో ఒక సందర్భం చేసుకునో చెప్పే తీరాలి. దానికోసం ఒక సాహితీవేత్తగా ఏదో ఒక సాహితీ ప్రక్రియ ఎన్నుకునే తీరాలి. అది ఆత్మ కథే అయినప్పుడు రాసేవారు మొహమాటాలు వీడే తీరాలి.
వివాహబంధం ఎంత పటిష్టమైనదో అందరికీ తెలిసినదే అయినా, వ్యక్తిగా మరణించి గహిణిగా మాత్రమే మిగిలిపోవడంకంటే.. ఆ బంధం తెంచుకోవాల్సి వచ్చినప్పుడు తెంచుకునే తీరాలి. తనకు తగిలిన గాయాల చేతిని కొంగుతో.. ఎద గాయాలను కొంగొత్త శక్తితో కప్పిపుచ్చి.. జీవనపథం వైపు సాగిపోయిన వైనం చెప్పే తీరాలి. చదువు ఇచ్చే అస్తిత్వం కోసం ఆస్తులను కూడా అమ్మిన వైనం, అసమర్థున్ని భరిస్తూ బతకడంకంటే.. చదవనిస్తే చాలని గడప దాటిన మగువ తెగువను.. నిజాయితీగా చెప్పిన తీరు చదువరులు మెచ్చే తీరాలి.
తన అనుభవాలను రాసినప్పుడు చిన్ననాట తల్లిని కోల్పోయినప్పుడు కానీ, నాలుగు యాక్సిడెంట్‌లను ఎదుర్కున్నప్పుడుగానీ, వైవాహిక జీవితంలో కుదిపేసిన సందర్భాలప్పుడు గానీ, ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కానీ ఎక్కడా కూడా రచయిత్రి కంటికి కడివెడుగా దుఃఖపడుతూ అక్షరాలలో దాన్ని ప్రవహింప చేయలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎంత ధీశాలిగా ఎదుర్కొన్నారో.. అవన్నీ కూడా జీవన ప్రవాహ గమనంలో సర్వసాధారణం అన్నంత మామూలుగా తన జీవన ప్రయాణంలాగానే ఈ రాతలు కూడా సాగాయి. ఎక్కడా తన జీవితంలో వున్న విషాదాన్ని పుస్తకంలోని ఏ పుటలోనూ పులమాలని చూడలేదు. అలా చూస్తే ఆవిడ డాక్టర్ అమతలత అయ్యేవారు కాదు. ఎక్కడా తను మాత్రమే ఆనందపడాలని చూసే వ్యక్తి కాదు. అందువల్లనే ఆమె అపురూప పురస్కారాల ప్రదాత అయ్యారు.
అమతలత గారిది అమ్మ మనసు. తన పిల్లలు తిన్నారా లేదా చూసుకున్నాకే తినే అమ్మలాంటి అతి గొప్ప మనసు. అలాగే తన చుట్టూ వున్నవాళ్ళు తినాలంటే దానికి కావలసినటువంటి ఆర్థిక స్వావలంబలం కావాలని నమ్మిన వ్యక్తి. అందుకే అనేకమందిని విద్యలో ప్రోత్సహిస్తారు. విద్యలో ప్రోత్సహిస్తే అది జీవితాన్నిస్తుంది. ఉద్యోగ ఉపాధిలకు ప్రోత్సహిన్నిస్తే అది వారినేకాక వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా నిలబడుతుంది. అలా తన జీవిత పర్యంతం తన చుట్టూ వున్న అనేకానేక వ్యక్తులను విద్య, ఉపాధిలలో ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టే.. ఇవాళ ఆమె అందరి వ్యక్తి అయ్యారు. వివిధ రంగాలలో కషి చేసినవారినికి పురస్కారమిస్తే అది వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని నమ్మే వ్యక్తి. అందుకే.. ఆమె ఆత్మకథ అమత చరిత.
తన ప్రయాణం మొత్తంలో సాహిత్యం ఆమె కిచ్చిన సాంత్వనతో కేవలం కథలు, సీరియళ్ళు రాయడమే కాదు, తరువాతి కాలంలో ఏకంగా వార పత్రిక, దిన పత్రికలను పెట్టడం ఆమె ఎంతటి కార్యానికైనా ముందడుగు వేసే శక్తిశాలి అని రుజువు చేశాయి. అది నిర్వహించలేని పరిస్థితులు వచ్చినప్పుడు గమనం మార్చుకునే తెగువ కూడా ఆమె స్వంతమని తెలిపాయి.
రెండవ గాయం నుంచి కూడా కోలుకుని, మేలుకుని, బిడ్డనెత్తుకుని.. కుటుంబ సహకారంతో తాను నిలబడి.. తనవారిని నిలబెడుతూ, తన చుట్టూ వున్నవారికి గొప్ప ఆలంబనౌతూ.. ఒక్కో విద్యాలయం నెలకొల్పుతూ.. విద్యా వ్యాప్తికి పాటు పడ్డ వ్యక్తి ఆమె. కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోయి తీరాలి అని నమ్మి అది వైవాహిక బంధమైనా.. పత్రికలను మూసివేయడమైనా, చేస్తూ వున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేయడమైనా.. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడుప్పుడు ఎంత సంఘర్షణను ఎదుర్కొని వుంటారో.. దాని తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి ఎంతగా సంసిద్దం అయి ఉంటారో.. ఏ విషయామైనా అది ఒక పరిస్థితిలా చెప్పారే తప్ప కంటికి కడివెడుగా దుఃఖిస్తూ పాఠకుల సానుభూతి పొందాలని చూడలేదు.
సమకాలీన పరిస్థితులు గురించి చెప్పినపుడు ఆయా కాలాల రాజకీయ పార్టీలు.. సినిమాలు, నటులు, సాహితీ పత్రికలు, స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల గురించి చెప్పారు. ఒక ఆత్మకథ ప్రయోజనం కూడా ఇదే. ఒకరి ఆత్మకథను చదువుతున్నప్పుడు ఆయా కాలాల ఆర్థిక సమాజిక రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వుపయోగపడతాయి.
ఈ రచన ఈమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరైనా ఆత్మకథ అంటే చిన్ననాటి నుంచి తనకు జరిగిన అందమైన అనుభవాలను, తనకు జరిగిన అన్యాయాలను వచ్చిన ఆపదలను వ్యక్తి ప్రాధాన్యతగా రాస్తున్న విషయాలే పూర్తిగా ఆక్రమించుకుంటాయి. కానీ ఈ రచనలోని ప్రతి సందర్భంలో కూడా తన పరిధిని కొంతవరకే పరిమితం చేస్తూ.. తన చుట్టూ వున్న మిత్రులను, కుటుంబ సభ్యులను, పరిసరాలను, పరిస్థితులను ఉన్నతీకరణ చేయడం ఈమె వ్యక్తిత్వం. ఇది అడుగడుగునా కనిపించింది.
సుదీర్ఘకాలం తాను అనుభవించిన జీవితంలో అనేకానేక మార్పులను, సాంకేతికతను, సౌకర్యాలను అనుభవిస్తూ ముందుకు సాగిపోవడమే జీవితానికి పరమార్థం కాదు కదా! అందుకని తాను ఎక్కి వచ్చిన ప్రతి మెట్టును, చిన్ననాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను పారదర్శకంగా వివరించారు. అంతటతో ఆమె సంతప్తి చెందలేదు. ఆ వివరాలు మన మనసులకు నేరుగా చేరుతాయో లేదో అని ప్రముఖ చిత్రకారుల సహాయం కోరి ఆనాటి చిత్రాలను, వై చిత్రాలను, తన మనో చిత్రాలను వారికి ఎరుకపరిచి గీయించారు. వాటిని సందర్భానుసారం ఇందులో పొందుపరిచారు. చిన్ననాటి నుంచి అనేక సందర్భాలలో వాడిన వస్తువులు, అప్పుడు చేసుకున్న పండగలు, అప్పటి రహదారులు, చెరువులు, గడీలు, బండ్లు, రోడ్లు, అనేకనేక వస్తువులు.. సందర్భాలు వీలైనంత వరకు చిన్న చిన్న చిత్రాల ద్వారా మనకు అందించారు. ఈ చిత్ర రచనలు ఈ పుస్తకానికి ఒక నూతనత్వానిచ్చి ప్రత్యేకతను ఆపాదించాయి
ఇక ఈ రచనకి ‘నా ఏకాంత బందగానం’ అనే శీర్షికనే చాలా వినూత్నమైన, అపురూపమైన, అద్భుతమైన శీర్షిక. ఎందుకంటే అమతలతగారిని ఎప్పుడూ ఒంటరిగా చూడలేం. తన చుట్టూ తప్పకుండా సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు.. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరనగలరు ఆమె ఒంటరి అని.
కానీ ఏ మనిషైనా.. ఎప్పుడో ఒకప్పుడు సమూహంలో కూడా ఏకాంతాన్ని అనుభవిస్తారు. ఈ మహా మాన్వి ఏకాంతంలోనూ జ్ఞాపకాల సందోహాన్ని, అనుభవించే మనిషని మనకి ఈ రచన తెలియజేస్తుంది. అమతలత జీవనయానాన్ని, జీవనగానాన్ని ఏక వాక్యంలోకి కుదించి చెప్పిన గొప్ప శీర్షిక. దీన్ని ఎంపిక చేసినవారికి జేజేలు.
ఎంతో మంచి కుటుంబ సభ్యులును, ఎంతో మంచి మిత్రులను, ఎంతో చక్కని వ్యక్తిత్వం వున్న పుత్రికను పొందిన ఈమె ధన్యురాలు. వ్యక్తి ఏ స్థాయిలో వున్నా వీరి ప్రేమకు పాత్రులే.. ఇచ్చుటలో వున్న హాయిని అనుభవించే గొప్ప వ్యక్తిత్వం ఈమెది. ఎందరో స్పూర్తి పొందవాల్సిన జీవితం వారిది. అందరూ చదివి తీరవలసిన ఒక ధీర విజయ గాధ ఇది. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన అమతలతగారికి ధన్యవాదాలు. ఈ పుస్తక రచనకు తోడ్పడ్డ ఆమె మిత్ర బందాన్ని అభినందిస్తూ.. ఈ పుస్తకం రెండవ భాగం కూడా రావాలని ఆమె అభిమానులందరం కోరుకుంటున్నాం.
- సమ్మెట ఉమాదేవి
9849406722