Wednesday, November 19, 2025
E-PAPER
Homeదర్వాజహృదయాన్ని కుదిపేసే గాలివాన

హృదయాన్ని కుదిపేసే గాలివాన

- Advertisement -

కథలు వినడం, ఊకొడుతూ నిద్రపోవడం బాల్యంలో ఎవరికైనా సహజం. నేనూ చిన్నతనంలో అక్బర్‌-బీర్బల్‌ కథలు, డిటెక్టివ్‌ కథలు, పౌరాణిక, జానపద కథలు ఆసక్తిగా చదివేవాడిని, ఎవరైనా చెప్పినా ఆనందంగా వినేవాడిని. అవి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి. కానీ, అన్ని కథలూ ఒకేలా ఉండవు. కొన్ని కథలు తుఫానులో అల్లాడిపోతున్న దూడపిల్లలా మనసును చిందర వందర చేస్తాయి. గొంతుపిట్టకు మౌనాన్ని మేతగా వేస్తాయి. కన్నీటి కాలువలను తెరిచి మనసు కల్మషాన్ని తుడిచివేస్తాయి. అట్లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అటువంటి అరుదైన కథల్లో ఒకటి పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన. నేను హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చదువుతున్నప్పుడు ఈ కథ నా హదయాన్ని కుదిపేసి, నా ఆలోచనలను మార్చివేసింది. 1952లో న్యూయార్క్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ వారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ద్వితీయ బహుమతి పొంది, ఈ కథ తెలుగు సాహిత్యానికి అఖండ కీర్తిని తెచ్చింది.
ఈ కథలో వేదాంతి అయిన రావుగారు గాలివాన సమయంలో రైలు ప్రయాణం చేస్తుండగా ఒక బిచ్చమెత్తుకునే స్త్రీని కలుస్తాడు. ఆమెను చూసి మొదట చీదరించుకున్న రావుగారు, గాలివానలో ఒక గదిలో ఆమెతో చిక్కుకున్నప్పుడు ఆమె కష్టాలను వింటాడు, మధ్యలో ఆ బిచ్చగత్తె సహాయం కూడా తీసుకుంటాడు. చివరకు ఆమె మరణం తర్వాత, ఆమె గౌరవాన్ని కాపాడేందుకు అయన పర్సును ఆమె చేతిలో వదిలేస్తాడు. ఆమెను ఎవరైనా దొంగగా అనుకోకుండా ఉండేందుకు అటు తర్వాత తన పేరున్న కార్డును పర్సు స్థానంలో ఉంచి, దిగులుగా నివాళి అర్పిస్తాడు. ఇలా ఈ కథ రావుగారి పరివర్తనను, ఆ స్త్రీ ధైర్యాన్ని లోతుగా చిత్రిస్తుంది.
ఇందులో ఆ రావుగారి మార్పు నా హదయాన్ని కదిలించింది. ఆ స్త్రీని మొదట అసహ్యించుకున్న అతను, ఆమె కథ విని, సానుభూతితో మనసును కుదుటపరచుకున్నాడు. ఆమె మరణం, ఆమె ధైర్యం చూసి రావుగారిలో వచ్చిన మార్పు పాఠకుడిని దుఃఖంలో ముంచెత్తుతుంది. ఈ కథ నాకు ఒక గొప్ప పాఠం. ఎలాగంటే, ఎవరినైనా తీర్పు చెప్పే ముందు వారి కథను అర్థం చేసుకోవాలని ఈ కథ అంతర్లీనంగా తెలుపుతుంది. అలాగే ఓ సందర్బంలో చీకటి గదిలో భయపడుతున్న రావు గారితో ఆ స్త్రీ ”ఇద్దరం ఉండటం ఒకరి కంటే నయం” అనే మాటలు కష్టాల మధ్య కూడా ఆనందం కనుగొనే కళను నేర్పుతుంది.
అయితే, మొత్తంగా ఈ కథ మాత్రం ప్రతీకలకు నిధి అని చెప్పాలి. ఎందుకంటే, రావుగారి ఇందులోని రైలు ప్రయాణం ఒక జీవిత యాత్ర లాంటిది. అతని నీతి, నియమాలు, వేదాంతం ఇవన్నీ జీవితంలోని అనిశ్చితులు. అవి ఏదోరోజు ఆత్మ పరిశీలన అనే గాలివానలో కొట్టుకుపోయి, నిర్మలమైన మానవత్వ వాతావరణాన్ని మాత్రమే మిగుల్చుతాయి.
అట్లాగ ఈ కథ సామాజిక తారతమ్యాలను అధిగమించి, మనలోని మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. రావుగారి పరివర్తన మన నీతి నియమాలను పరిశీలించమని, ఆ స్త్రీ ధైర్యం కష్ట సమయాల్లో స్థైర్యంగా ఉండమని నేర్పుతుంది.
పద్మరాజు గారి సున్నితమైన రచన గాలివాన హౌరు, ఆ స్త్రీ చిరునవ్వు, కథను భావోద్వేగాత్మకంగా, ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ కథ చదివితే, మనలోని మంచిని మేల్కొల్పి, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి సహాయపడుతుంది.
– సందీప్‌ ఒటారికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -