‘దొంగఓట్ల, దొంగనోట్ల రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి వెధవలిచ్చే సాక్ష్యం ఓసాక్ష్యమా?’ అన్నాడో రచయిత. దేశంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. కొద్దిరోజులుగా బీహార్‌లో ఓట్ల సవరణ పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగిస్తున్న కేంద్రం, దానికి వంతపాడుతున్న ఈసీపై విమర్శలు పెల్లుబుకుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమస్య తీవ్రతను మరింత ఎత్తిచూపుతోంది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్ని కల్లో బీజేపీ, ఈసీ కమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. బెంగళూర్ సెంట్రల్ లోక్‌సభ సీటును ఉదాహరణగా చూపిన ఆయన అనేక అంశాల్ని లేవనెత్తారు. దీంతో మన రాజ్యాంగాన్ని దేశ ఏలికలే నిలువెత్తు గోయితవ్వి అందులో పాతిపెట్టినట్టు రుజువైంది. ఎందుకంటే, ఇది ప్రజాస్వామ్య ముసుగులో చేసిన భారీమోసం! అధికార వ్యామోహం మాటున జరిగిన అతిపెద్ద అరాచకం. బీజేపీ రాజకీయపరంగా ఎంతటి అనైతికతను ప్రదర్శిస్తున్నదనే దానికి ఇదో ఉదాహరణ.
రాహుల్‌గాంధీ ఈ ఒక్కఅంశమే కాదు, ఎన్నికల్లోని చిత్రాలన్నీ బయటపెట్టారు. ఆరునెలల నుంచి ప్రణాళిక ప్రకారం ఓట్ల దస్త్రాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. కర్నాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచింది.అక్కడ కాంగ్రెస్ ఇతర నియోజకవర్గాల్లో అధిక్యంలో ఉన్నప్పటికీ ఒకే నియోజకవర్గం ఫలితాలను తారుమారు చేసింది.అంటే అక్కడ బీజేపీ అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది! అందుకే పదినుంచి పదిహేను సంవత్సరాల సీసీటీవీ పుటేజీతో పాటు, డేటా ఇవ్వాలనేది ఆయన డిమాండ్ చేస్తు న్నారు. ఆ వివరాలు ఎన్నికల కమిషన్ ఇవ్వకుంటే ఆనేరంలో భాగస్వాములైనట్టే! ఒక నియోజకవర్గంలో లక్షదొంగ ఓట్లు, ఐదు నెలల వ్యవధి లోనే కొత్తగా కోటి ఓట్లు నమోదయ్యాయంటే ఏదో మతలాబుందనేది విశ్లేషకుల అనుమానం కూడా. అంతేకాదు, ఒక సింగిల్ బెడ్‌రూం ఇంట్లో నలభై ఎనిమిది ఓట్లు ఉండటం ఆశ్చర్యకరం. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసే అవకతవకలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం.అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లుండటం, ఎగ్జిట్, ఓపినియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు రావడం అనుమానాలకు బలాన్ని చేకూర్చే అంశాలు.
గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో నలభై లక్షలు ఓట్లు రహస్యంగా జోడించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఐదునెలల్లో నమో దైన ఓటర్లే ఇందులో ఎక్కువగా ఉండటం మరీ ఆందోళనకరం. ఇదంతా చూస్తే కేంద్రం కనుసన్నల్లోనే అక్రమాలకు తెరదీసినట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల్లో మోసం లేదని చెబుతున్న బీజేపీ, రాహుల్ అడిగిన వివరాలిచ్చేందుకు మాత్రం ససేమిరా అంటోంది! అవకతవకలు జరగలేదని ఖండించినప్పుడు వారడిగిన డేటా ఇస్తే తప్పేంటి? చర్చకు నిలబడకపోవడానికి కారణమేంటి? మహారాష్ట్ర ఫలితాలపై గణాంకాలతో సహా వివరించినప్పటికీ సాంకేతికపరమైన ఓటర్ల జాబితాను ఇవ్వకపోవడంలో తాత్సారమెందుకు? పైన చెప్పుకున్న విధంగా మహదేవపుర అసె ంబ్లీ నియోజకవర్గంలో డూప్లికేట్ ఓట్లు, తప్పుడు చిరునామా ఉన్నవి, బల్క్ లేదా సింగిల్ అడ్రస్ ఓట్లు, ఫారం-6 దుర్వినియోగం మొత్తంగా సుమారు లక్షఓట్లు దొంగిలించబడటం పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప వేరేకాదు. అప్పటివరకు మందగించిన పోలింగ్ సాయంత్రం ఐదుతర్వాత పెరగడమేంటి? ఇలాంటి అనేక అనుమానాస్పద ప్రశ్నలకు జవాబు చెపాల్సింది ఈసి.
ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన పునాది ఎన్నికల ప్రక్రియ. ఇందులో పేదలు, ధనికులనే తేడా లేకుండా అందరూ పోటీకి అర్హులు. ఇప్పటివరకు ధనబలం, అధికారబలం ఎన్నికలకు ప్రధాన శత్రువులుగా ఉన్నమాట వాస్తవం! అయితే వాటికి తోడుగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే విధంగా అక్రమాలకు తెరదీయడం ప్రజాస్వా మ్యాన్ని నిర్వీర్యం చేయడమే.ఎన్నికలు కూడా విశ్వసనీయంగా జరక్క పోతే ఎలా? 2024 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పోయినట్టుగా బీజేపీ 240 సీట్లను గెలుచుకుంది. ఇరవై ఐదు సీట్లు తక్కువగా వచ్చి ఉంటే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశమే ఉండేది కాదు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందనుకుంటే, అంచనాలను తారుమారు చేస్తూ గెలుస్తూ వచ్చింది. ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలపై రాహుల్ అనేక సందేహాలు, విమర్శనాస్త్రాలు గుప్పించారు. అందుకే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటే తప్ప నిజానిజాలు వెల్లడికావు. సమగ్ర విచారణ ద్వారా ఎన్నికల స్వామ్యాన్ని బలపరచాలి. దానిమీద ప్రజలకు విశ్వాసాన్ని పెంచాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి ఈసి విరుద్ధంగా నడుచుకుంటే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
దొంగఓట్ల రాజ్యం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES