నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న మహిళ డ్రగ్స్ కు బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే సుమారు రూ.70 లక్షల విలువైన మాదకద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యురాలి వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తాజాగా రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన నమ్రత కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ లో సంప్రదించి రూ.5 లక్షల విలువైన కొకైన్ కు ఆర్డర్ చేసింది. ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు. నగరానికి కొకైన్ తీసుకొచ్చిన రాంప్యార్.. ఆ ప్యాకెట్ ను డాక్టర్ నమ్రతకు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటరయ్యారు. డాక్టర్ నమ్రతతో పాటు రాంప్యార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ కి బానిసైన లేడీ డాక్టర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES