నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం తొలి పావంచా వద్ద నిర్మించిన భారీ రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో షెడ్డు కింద భక్తులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఈ తాత్కాలిక షెడ్డును ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే, షెడ్డు పునాదులను కాంక్రీటుతో పటిష్టం చేయకుండా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. భారీ షెడ్డు బరువును బలహీనమైన పునాదులు మోయలేకపోవడంతో అది ఒక్కసారిగా నేలమట్టమైంది.
సాధారణంగా ఈ ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం సింహాద్రి అప్పన్న దయేనని భక్తులు అంటున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో చేపట్టే నిర్మాణాల నాణ్యతపై భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.