Sunday, May 11, 2025
Homeమానవిఅమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది…

అమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది…

- Advertisement -

అనురాగనికి అర్ధం అమ్మ.. మమతకు మారు పేరు అమ్మ.. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చిరునామా అమ్మ. మనకు జన్మనివ్వడం ఒక భాగమైతే… తన రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని సరైన దారిలో పెట్టేందుకు ఎంతో కష్టపడేది అమ్మ. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది.. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు, అమ్మ ఉన్న చోట ఆనందం పురి విప్పి ఆడుతుంది. మనం ఎంత వద్దునుకున్నా మన జీవితాంతం తోడు వచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటే. అలాంటి అమ్మ ప్రేమను గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం.
– పాలపర్తి సంధ్యారాణి


అమ్మంటేనే త్యాగం
సృష్టికి కారణం అమ్మ. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. ఆమె త్యాగం వెనక ఎన్నో అవమానాలు దాగి ఉంటాయి. అయినా ఆమె ఒక చిరునవ్వుతో పిల్లలకు జీవితాన్ని ఇస్తుంది. ‘చందమామ రాదు’ అని తెలిసినా, ‘రావే రావే’ అని నాకోసం ఎన్నో సార్లు బతిమిలాడి, నాకు అన్నం తినిపించిన మా అమ్మ ప్రేమకు నమస్కారం. నా ఏడుపు విని తినే భోజనాన్ని కూడా పక్కకు పెట్టి నా అవసరాన్ని తీర్చిన అమ్మకు నా కృతజ్ఞతలు. తప్పటడుగులు వేస్తున్న నా చేయి పట్టుకుని సరిగ్గా నడిపించిన అమ్మకు నా నమస్కారం. నా మొదటి గురువు అయిన నా తల్లికి నా సాష్టాంగ నమస్కారం. ఈ రోజు నేను ఆమె గురించి నా భావాలను వ్యక్తపరచగలిగేలా నన్ను ప్రయోజకురాలిగా తీర్చిదిద్దిన తల్లికి నమస్కారం. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఈ సృష్టిలో లేదు, రాదు, కనిపించదు.
– ప్రతిభ

అమ్మ రుణం తీర్చుకోలేనిది
అమ్మ గిరిజ, నాన్న తటవర్తి నాగేశ్వర రావు. నేను పుట్టింది తాడేపల్లిగూడెంలో. స్కూలింగ్‌ అంతా రావులపాలెం గవర్నమెంట్‌ స్కూల్లో జరిగింది. తొంభైల్లో పిల్లలు తల్లిదండ్రులతో అంత ఓపెన్‌గా ఏదీ చర్చించే వారు కాదు. అంత భయం భక్తి ఉండేవి. అదే ఇప్పటికీ నాలో ఉంది. ఇప్పటి పిల్లలకి ఉన్నంత స్వేచ్ఛ అప్పుడు లేదు. నిజానికి అమ్మ నాన్నలతో మాట్లాడడానికి నాకు అసలు టైమే ఉండేది కాదు. పొద్దున్న ఆరు గంటలకు స్పోర్ట్స్‌ ప్రాక్టీస్‌, తర్వాత స్కూల్‌. సాయంత్రం మళ్లీ ప్రాక్టీస్‌, ట్యూషన్‌.. రావడం స్నానం చేయడం, తినడం, పడుకోవడం. నాన్న పాల వ్యాపారం అప్పుడప్పుడు చాలా నష్టాల్లో ఉండడం.. అమ్మ మెడలో ఎప్పుడూ పసుపు తాడే ఉండటం… అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఎంత గొడవ చేసినా అమ్మ చాలా ఓపిగ్గా సమాధానం చెప్పడం ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఇది చూసి నేను నేర్చుకున్నది జీవితంలో ఎప్పుడూ అప్పు చేయకూడదని. అమ్మ నుంచి ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే… ఇంట్లో ఏమీ లేకపోయినా ఏముంటే వాటితోనే వంట చేసి మా కడుపు నింపేసేది. ఎన్ని కష్టాలు వచ్చినా ఊరు కాని ఊరు వచ్చి, ఎన్ని అవమానాలు పడ్డా అమ్మ ఏ రోజూ అధైర్య పడలేదు. అదే మాకూ వచ్చిందేమో. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ సున్నా నుంచి మొదలు పెడతాను. అయితే పిల్లలకి పెళ్లి అయితే గానీ తల్లిదండ్రుల విలువ తెలియదు. తల్లిదండ్రుల పాత్ర గొప్పతనం కూడా కూడా తెలియదు. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ ఎప్పుడూ ఆడపిల్లకి చేతిలో ఏదైనా ఒక ఆర్ట్‌ ఉండాలమ్మా అనేవారు. అది ఎంత నిజమో పెళ్లయిన తర్వాతే అర్థమైంది. ఆడవాళ్లు చదువుకోవడం అవసరం, సంపాదించడం చాలా అవసరం. పిల్లల్ని సమాజిక విలువలతో పెంచడం మరీ అవసరం. ఇవన్నీ నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఏది ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోకుండా జీవితంలో ముందుకు సాగడం అమ్మ వల్లనే అలవడింది. అమ్మ చేసే ప్రతి పనీ మా ఆనందం కోసమే, మా ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునేది. అమ్మా.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను?
– అంజలి, సీఇఓ, సిగేచర్‌ స్టూడియో

అమ్మ నాకు స్ట్రాంగ్‌ పిల్లర్‌
అమ్మ సుధారాణి. నాన్న నరసింహారావు. మా సొంతూరు గుంటూరు. నాకు ఇద్దరు తమ్ముళ్లు. నాన్న వ్యాపారం చేసేవారు. నేను గుంటూరులోనే బీకాం వరకు చదువుకున్నాను. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒక స్నేహితురాలిగానే ఉండేది. అన్ని విషయాలు దాపరికం లేకుండా అమ్మతో షేర్‌ చేసుకునే స్వేచ్ఛ ఉండేది. చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. ఆటల్లో, నాట్యంలో చాలా ప్రోత్సహించేవారు. చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి నేర్పించారు. ఆ రోజుల్లో శ్రీరామనవమి పందిళ్లలో చిన్న పిల్లల చేత డాన్స్‌ చేయించేవారు. అలా నేను నా నాలుగవ ఏట డాన్స్‌ చేశాను. ప్రతిరోజు అమ్మ నన్ను డాన్స్‌ స్కూల్‌కి తీసుకెళ్లేది, తీసుకొచ్చేది. అలాగే రామనవమి ఉత్సవాల్లో కూడా అమ్మ ప్రోత్సాహంతోనే పాల్గొనేదాన్ని. అన్ని రంగాల్లో నన్ను నిష్ణాతురాలిని చేయాలనే ఆలోచన అమ్మకు బాగా ఉండేది. పదో తరగతి వరకు నేను సైకిల్‌ నడిపే దాన్ని. ఇంటర్‌కి వచ్చిన తర్వాత లూనా, టీవీఎస్‌ నడిపాను. నేను పదవ తరగతిలో ఉండగా అమ్మ కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి వెళ్ళేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్ళి నేర్చుకున్నాను. నిజానికి పదిహేనేండ్లకు డ్రైవింగ్‌ ఎవరూ నేర్పరు. ఆడపిల్ల అంటే చాలా బోల్డ్‌గా ఉండాలి, జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోగలిగే మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి అనే రీతిలో అమ్మ నన్ను పెంచారు. అమ్మకు నన్ను సినిమాల్లో చూడాలనే కోరిక ఉండేది. దాసరి నారాయణరావు గారు మాకు దూరపు బంధువు. నా టెన్త్‌ క్లాస్‌ అయిపోయిన తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్లారు. ఆయన నన్ను చూసి ‘చాలా చిన్న పిల్ల, ఇంకా ఎదగాలి’ అని చెప్పి పంపించేశారు. ఇంటర్‌ తర్వాత మళ్లీ తీసుకెళ్తే అప్పుడు సన్నగా ఉండేదాన్ని ఆయన చూసి ‘అమ్మాయి చాలా సన్నగా ఉంది, కొద్ది రోజుల తర్వాత చూద్దాం’ అన్నారు. డిగ్రీ రెండవ ఏడాదిలో ఉండగా మళ్ళీ తీసుకెళ్లారు. అప్పటికి నాకు కొంచెం మానసిక పరిపక్వత వచ్చింది. అప్పుడు దాసరి గారితో ‘అమ్మకు నన్ను సినిమాల్లో చూడాలి అని ఉంది, కానీ నాకు ఇంట్రెస్ట్‌ లేదు’ అని చెప్పాను. అప్పుడు ఆయన ‘అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు, చదువుకుంటా అంటుంది కదా చదివించండి, ఆ తర్వాత పెళ్లి చేయండి’ అని చెప్పారు. నా వివాహం అయిన తర్వాత అనుకోకుండా ఒక టీవీ ప్రకటన చూసి సరదాగా అప్లై చేసాను. సెలెక్ట్‌ అయ్యాను. అలా భర్త ప్రోత్సాహం, అమ్మ సహకారంతో నటిగా కూడా రాణించాను. ఎక్కడ షూటింగ్స్‌ ఉన్నా అమ్మ నాతో వచ్చేవారు. కుటుంబ పరంగా ఏదైనా సమస్య వచ్చినా నాకు ధైర్యం చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. సర్దుకుపోవాలి అని చెప్పేవారు. అమ్మ నాకు స్ట్రాంగ్‌ పిల్లర్‌. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మే కారణం.
– జయలక్ష్మి హరిదాసు, సినీ నటి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -